Tamil Nadu Politics: త‌మిళ‌నాడులో మ‌రోసారి ప్ర‌భుత్వం vs గ‌వర్న‌ర్.. అమిత్ షా జోక్యంతో కీల‌క‌ నిర్ణ‌యం ..

తమిళనాడు ప్రభుత్వంతో వివాదం ముదురుతున్న సమయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది.

  • Written By:
  • Updated On - June 30, 2023 / 09:05 PM IST

త‌మిళ‌నాడు (Tamil Nadu) రాజ‌కీయాల్లో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షాల కంటే గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎస్ ర‌వి (Governor RN Ravi) తోనే త‌ల‌నొప్పి ఎదుర‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ లేఖ రాయ‌డం పెద్ద వివాదానికి తెర‌లేపింది. ఈ విష‌యంపై కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) జోక్యం చేసుకోవ‌టంతో గ‌వ‌ర్న‌ర్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకున్నాడు. అస‌లు విష‌యంలోకి వెళితే.. త‌మిళ‌నాడు సీఎం ఎం.కె. స్టాలిన్ (CM MK Stalin) త‌న కేబినెట్‌లోకి మంత్రిగా సెంథిల్ బాలాజీ ని తీసుకున్నారు. గ‌తంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన సెంథిల్ బాలాజీ.. ఉద్యోగాల పేరిట మోసాల‌కు పాల్ప‌డ్డార‌ని, ప‌లు అవినీతి కేసుల్లో చిక్క‌కున్నారు. అత‌నిపై విచార‌ణ కొన‌సాగుతుంది. ఇటీవ‌ల అవినీతి కేసులో పోలీసులు సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. కొద్దిరోజుల త‌రువాత సెంథిల్ బాలాజీ చూస్తున్న శాఖ‌ను వేరే మంత్రికి బ‌దిలీ చేస్తూ సీఎం స్టాలిన్ నిర్ణ‌యం తీసుకున్నారు.

అవినీతి కేసులో అరెస్ట్ అయిన సెంథిల్ బాలాజీని శాఖ‌లు లేకుండా కేబినెట్‌లో కొన‌సాగిస్తున్న‌ట్లుగా స్టాలిన్ పేర్కొన్నారు. అయితే, సీఎం స్టాలిన్ నిర్ణ‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి త‌ప్పుబ‌ట్టారు. నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న, అరెస్టు అయిన వ్య‌క్తిని కేబినెట్‌లో ఎలా కొన‌సాగిస్తార‌ని, అత‌న్ని మంత్రి వ‌ర్గం నుంచి డిస్మిస్ చేస్తూ గురువారం సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రుల నియామ‌కాలు, తొల‌గింపులు ముఖ్య‌మంత్రి సిఫార‌సుల మేర‌కే జ‌ర‌గాల‌ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింద‌ని, గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని చ‌ట్ట ప్ర‌కారం ఎదుర్కొంటామ‌ని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ తీరును డీఎంకే మిత్ర‌ప‌క్షాల నాయ‌కులు త‌ప్పుబ‌ట్టారు.

గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి తీసుకున్న నిర్ణ‌యం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ విష‌యం కేంద్ర  హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌ద్ద‌కు చేర‌డంతో అమిత్ షా వెంట‌నే స్పందించారు. సెంథిల్ బాలాజీని మంత్రి ప‌ద‌వి నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆదేశాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని, ఈ వివాదాస్ప‌ద నిర్ణ‌యంపై న్యాయ స‌ల‌హా కోర‌డం మంచిద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సూచించిన‌ట్లు తెలిసింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ వెన‌క్కుత‌గ్గి శుక్ర‌వారం ఉద‌యం మ‌రోలేఖ‌ను విడుద‌ల చేశారు.ఈ లేఖ‌లో.. బాలాజీని మంత్రి వ‌ర్గం నుంచి డిస్మిస్ చేస్తూ తాను ఇచ్చిన లేఖ‌ను వెన‌క్కు తీసుకోవ‌టం జ‌రిగింద‌ని తెలిపారు. అటార్నీ జ‌న‌ర‌ల్ ను స‌ల‌హా కోర‌డం మంచిద‌ని అమిత్ షా చెప్పిన‌ట్లు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో తాను అటార్నీ జ‌న‌ర‌ల్‌ను సంప్ర‌దిస్తాన‌ని, తాను త‌దుప‌రి ఉత్త‌ర్వులు జారీచేసే వ‌ర‌కు సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేస్తూ అంత‌కుముందు ఇచ్చిన ఆదేశాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి లేఖ‌లో పేర్కొన్నారు. అయితే, గ‌వ‌ర్న‌ర్ తీరుప‌ట్ల డీఎంకే, దాని మిత్ర ప‌క్షాలు మండిప‌డ్డాయి.

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ తీరుపై కాంగ్రెస్ పార్టీసైతం మండిప‌డింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి మ‌నీష్ తివారీ మీడియాతో మాట్లాడారు. త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్‌ను తొల‌గించాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరారు. గ‌వ‌ర్న‌ర్‌కు త‌న ప‌రిధి ఏమిటో తెలియ‌ద‌ని, రాజ్యాంగ విరుద్ధ చ‌ర్య‌ల‌ను ఆయ‌న తీసుకోరాద‌ని అన్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే ఆయ‌న బాధ్య‌త‌లు ఏమిటో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని, వెంట‌నే ఆర్ఎన్ ర‌విని గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని అన్నారు.

Selfie with Currency Notes: భార్య, పిల్ల‌లు చేసిన ప‌నికి చిక్కుల్లో ప‌డ్డ పోలీస్ అధికారి.. త‌ప్పు తేలితే క‌ట‌క‌టాలే?