Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.

Published By: HashtagU Telugu Desk
Cm Stalin

Cm Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది. ముందు ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు. సంక్షేమ పథకాలకు నిధులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు రూ.6000 కోట్లు కేటాయింపు, జీఎస్టీ బకాయిల చెల్లింపుపై వీరిరువరి భేటీలో ప్రధానంగా చర్చ ఉంటుంది. దుబాయ్ పర్యటనలో చేసుకున్న ఒప్పందాల గురించి కూడా ఆయన ప్రధానికి వివరిస్తారు. ప్రధానిని కలిసిన తరువాత అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ వంటివారితో జరిగే భేటీల్లో ప్రధానమైన అంశాలను చర్చిస్తారు.

ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయిన తరువాతిరోజు.. అంటే ఏప్రిల్ 1న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, వామపక్ష నేతలతోనూ స్టాలిన్ సమావేశమవుతారు. తరువాత ఢిల్లీలో కొత్తగా కట్టిన పార్టీ ఆఫీస్.. అన్నా కలైంజర్ అరివాలయాన్ని ఏప్రిల్ 2న ప్రారంభిస్తారు. నిజానికి ఈ బిల్డింగ్ పనులు కిందటి డిసెంబర్ లోనే పూర్తయినా.. కరోనా ఉధృతి దృష్ట్యా అప్పుడు ప్రారంభించలేదు. ఇప్పుడు కేసుల తగ్గడంతో ప్రారంభం చేస్తారు. దీనికి సోనియాగాంధీతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరవుతారు. పార్టీ ఆఫీసులోనే ఏర్పాటుచేసిన అన్నాదురై, కరుణానిధి విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

దేశరాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయనుకుంటున్న ఇలాంటి తరుణంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర హక్కుల సాధన కోసమే ప్రధాని మోదీతో భేటీ అని పార్టీ శ్రేణులకు రాసిన లేఖలో చెప్పారు స్టాలిన్. కానీ ఢిల్లీలో విపక్ష నేతలతోనూ మీటింగ్ లు ఉండడం, మమతా బెనర్జీని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు పిలవడంతో.. కొత్త ఫ్రంట్ విషయంలో మళ్లీ కదలిక వస్తుందేమో అని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

  Last Updated: 31 Mar 2022, 11:47 AM IST