100% FDI- First Project : భారతదేశ రక్షణ రంగ ప్రాజెక్టులలో ఇప్పటివరకు 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే తొలిసారిగా 100 శాతం ఎఫ్‌డీఐతో భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం ఒక కంపెనీకి అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. నూరు శాతం ఎఫ్‌డీఐతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు స్వీడన్‌కు చెందిన సాబ్ ఎఫ్ఎఫ్వీ(Saab FFV)కి భారత సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం. భుజంపై మోసుకెళ్లి శత్రు లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఉపయోగించే రాకెట్లను ఈ కంపెనీ మన దేశంలో తయారు చేయనుందట.
We’re now on WhatsApp. Click to Join.
దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడితో ‘‘కార్ల్ గస్టాఫ్ 8.4 సెంటీమీటర్ల రీకాయిలెస్ రైఫిల్’’ మోడల్‌కు చెందిన షోల్డర్ ఫైర్డ్ రాకెట్స్ తయారీ కేంద్రాన్ని హర్యానాలో ఏర్పాటు చేస్తామంటూ సాబ్ కంపెనీ చేసుకున్న దరఖాస్తును అక్టోబరులోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆటోమేటిక్ రూట్‌లో 74 శాతం ఎఫ్‌డీఐతో భారత్‌లో రక్షణ ఉత్పత్తుల సంస్థలను ఏర్పాటు చేయొచ్చు. అయితే ఎఫ్‌డీఐ అంతకుమించితే.. ఆ ప్రాజెక్టును బట్టి దాని ప్రాధాన్యత, దేశ సైనిక అవసరాలకు అనుగుణంగా క్లియరెన్స్ ఇస్తారు. రక్షణ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించే నియమాలను 2015లోనే సడలించారు. అయితే రక్షణ రంగంలోకి ఇప్పటివరకు 100 శాతం FDIతో ఏ విదేశీ సంస్థను కూడా అనుమతించలేదు. మేక్ ఇన్ ఇండియాకు బలం చేకూర్చడానికే మనదేశంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్వీడన్ కంపెనీ సాబ్‌కు పచ్చజెండా ఊపారని పరిశీలకులు(100% FDI- First Project) అంటున్నారు.