Site icon HashtagU Telugu

Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి

Injection Reaction (1)

Injection Reaction (1)

Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు కొద్ది గంటల వ్యవధిలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ విషాదకర ఘటనకు తప్పుడు ఇంజెక్షన్‌నే కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆసుపత్రిలోని ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో చేరిన ఐదుగురు రోగులు రాత్రికి రాత్రే చనిపోయారు. కొన్ని నిమిషాల ముందే వీరికి రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చినట్టు బాధిత కుటుంబాలు తెలిపాయి. “మా సోదరికి ఓ నర్సు ఇంజెక్షన్ వేసింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయింది. డాక్టర్‌ను పిలవగానే వచ్చారు కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది,” అని ఓ కుటుంబ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

మృతుల్లో అంతకుముందు శస్త్రచికిత్సలు జరిగినవారు కూడా ఉన్నారు. ఆరోగ్యం మెరుగవుతుండగానే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి విషమించిందని బంధువులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సూచన అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మరణాలకు కారణంగా తేల్చేందుకు పోస్టుమార్టం నివేదికను ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం..వీటిపైనే ప్రధాన చర్చ