Madrasas : కేంద్రానికి షాక్.. ఆ మదర్సాల మూసివేత ఆదేశాలపై ‘సుప్రీం’ స్టే

మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతరుల అడ్మిషన్లను ప్రభుత్వ స్కూళ్లకు మార్చాలని ఇటీవలే ఉత్తరప్రదేశ్, త్రిపురలోని బీజేపీ ప్రభుత్వాలు(Madrasas) ఆదేశాలు ఇచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Government Funded Madrasas Supreme Court Child Rights Panel

Madrasas : విద్యాహక్కు చట్టాన్ని పాటించని ప్రభుత్వ ప్రాయోజిత మదర్సాలను మూసి వేయాలంటూ  నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీ‌సీఆర్) చేసిన సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వాటిని అమలు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఆదేశించింది. ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలలో చదువుతున్న విద్యార్థులను , ప్రభుత్వ ప్రాయోజిత మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతరుల అడ్మిషన్లను ప్రభుత్వ స్కూళ్లకు మార్చాలని ఇటీవలే ఉత్తరప్రదేశ్, త్రిపురలోని బీజేపీ ప్రభుత్వాలు(Madrasas) ఆదేశాలు ఇచ్చాయి. ఈ ఆదేశాలపైనా సుప్రీంకోర్టు స్టే విధించింది.  ఈ ఏడాది జూన్ 7, 25 తేదీల్లో ఎన్‌సీపీ‌సీఆర్ జారీ చేసిన సర్క్యులర్లను అమలుపర్చొద్దని నిర్దేశించింది.

Also Read :Hezbollah Vs Israel : ఇజ్రాయెల్ భయం.. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ ఇరాన్‌కు పరార్

ఎన్‌సీపీ‌సీఆర్ సిఫార్సులకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జమియత్ ఉలెమాయే హింద్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సిఫార్సులు దేశంలోని మైనారిటీల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని వాదన వినిపించారు. సొంతంగా విద్యాసంస్థలను నిర్వహించుకునే మైనారిటీల హక్కును కాలరాసే ప్రయత్నం జరుగుతోందని జమియత్ ఉలెమాయే హింద్ పేర్కొంది. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు  ఇచ్చింది.  ఎన్‌సీపీ‌సీఆర్ సిఫార్సుల అమలును నిలుపుదల చేసింది. జమియత్ ఉలెమాయే హింద్ సంస్థ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్‌లో యూపీ, త్రిపురతో పాటు ఇతర రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేర్చుకునే వెసులుబాటును జమియత్ ఉలెమాయే హింద్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

Also Read :Pro Khalistan Group: ఢిల్లీ పేలుడు వెనుక ఖలిస్తానీలు.. టెలిగ్రాంకు పోలీసుల లేఖ

  Last Updated: 21 Oct 2024, 01:26 PM IST