Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసు(CBI case)లో నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిల్ అనొద్దని.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ సీబీఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదు. దీంతో.. కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. ఆయన బెయిల్ పిటిషన్పై స్పందించాల్సిందిగా సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ మనీలాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలపై సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల జైలు జీవితం అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో పోటీ చేసిన క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేశారని, ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తోంది.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకి ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆ తరవాత రెండు రోజులకే అరవింద్ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. సీబీఐ, ఈడీ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కావాలని కోరారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ఇదే వ్యవహారంపై విచారణ జరిపింది. సీబీఐ అరెస్ట్‌ని అక్రమమని కేజ్రీవాల్ వాదించినప్పటికీ కోర్టు ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదు. ఈ అరెస్ట్ అనైతికం కాదని తేల్చి చెప్పింది. పక్కా సాక్ష్యాధారాలున్నప్పుడు అక్రమం అని ఎలా అంటామని ప్రశ్నించింది. ఆగస్టు 5వ తేదీన ఈ తీర్పునిచ్చింది. ఆ తరవాతే కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.