Site icon HashtagU Telugu

Compassionate appointments : కారుణ్య నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..!

supreme court cancels greater housing society land allotment

supreme court cancels greater housing society land allotment

supreme court : కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఏదీ లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పలు కారుణ్య నియామకాలను ఈ తీర్పు ప్రశ్నార్థకంలోకి నెట్టినట్లయింది. ఈ మేరకు రెండున్నర దశాబ్దాల క్రితం సర్వీసులో ఉండగా మరణించిన ఉన్న ఓ కానిస్టేబుల్ కుటుంబం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా, ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. సాధారణంగా జరిగే కారుణ్య నియామకం ప్రభుత్వోద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురికారాదనే ఉద్దేశంతో జరిగేదే తప్ప సుదీర్ఘ కాలం తర్వాతా పొందే హక్కు కాదని తీర్పు వెలువరించింది. కాగా, హరియాణాకు చెందిన టింకూ అనే పిటిషనర్‌ తండ్రి జైప్రకాశ్‌ 1997లో సర్వీసులో ఉండగా మృతి చెందారు. అయితే, ఆ సమయానికి కుమారుడు టింకూకు ఏడేళ్లు కాగా, మృతుని భార్య నిరక్షరాస్యురాలు. ఈ కారణంగా ఆమె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయకుండా, తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని ఉన్నతాధికారులకు విన్నవించారు.

అలా టింకూ మేజర్‌ అయిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వస్తుందని భావించారు. వారి అభ్యర్థన మేరకు 1998లో టింకూ పేరును అప్పటి హరియాణా డీజీపీ రికార్డులలో నమోదు చేశారు. అలా 2008లో అంటే, జైప్రకాశ్‌ మరణించిన 11 ఏళ్లకు అతని కుమారుడు టింకూ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. కారుణ్యనియామకానికి ఉద్యోగి మరణించిన మూడేళ్లలోపు దరఖాస్తు చేసుకోవాలంటూ 1999లో వచ్చిన నిబంధన మేరకు అధికారులు టింకూ అభ్యర్థనను పక్కనపెట్టారు. అయితే, అధికారుల నిర్ణయాన్ని తప్పుబడుతూ తనకు న్యాయం చేయాలని టింకుకు కింది కోర్టులను ఆశ్రయించారు. అయితే, వాటితో సహా పంజాబ్‌-హరియాణా హైకోర్టులోనూ టింకూకు చుక్కెదురైంది. దీంతో ఆ కుటుంబ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. పిటిషనర్ పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పులను సమర్థించింది. అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా, ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించలేదంటూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

Read Also: Phone Tapping Case : టేబుల్‌పై గన్ పెట్టి  నన్ను బెదిరించారు : ఎమ్మెల్యే వేముల వీరేశం