Waqf Bill : సుప్రీంకోర్టులో ఈరోజు వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. గత విచారణలో వక్ఫ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు అమలు చేయకుండా స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కేంద్రం ఇవాళ వక్ఫ్ చట్టంపై తమ అభిప్రాయం తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టం అమలుపై తాత్కాలికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. వాటిపై మధ్యంతర దశలో నిషేధం విధించడం అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం. అలాగే, కోర్టులకు ఇటువంటి స్టే ఇచ్చే అధికారాలు నేరుగా లేదా పరోక్షంగా చట్టాల్లో పేర్కొనబడలేదని పేర్కొంది.
Read Also: Living Apart Together: ఏంటీ ఈ సరికొత్త ట్రెండ్.. లివింగ్ అపార్ట్ టుగెదర్ అంటే ఏమిటి?
చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు నిస్సందేహంగా ఉన్నప్పటికీ, ఈ తాత్కాలిక దశలో ఏదైనా నిబంధన అమలుకు వ్యతిరేకంగా నిషేధాజ్ఞ జారీ చేయడం దేశంలోని వివిధ వ్యవస్థల మధ్య సున్నితమైన అధికార సమతుల్యతను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. వక్ఫ్ చట్టంపై ప్రస్తావిస్తూ ఇది ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ సిఫార్సులతో, పార్లమెంటు ఉభయ సభలలో విస్తృత చర్చ తర్వాత చట్టంగా మారిందని కేంద్రం తెలిపింది. అలాగే ఎటువంటి మధ్యంతర ఉత్తర్వు ద్వారా రక్షణ కోరవద్దని తెలిపింది. గత వారం కోర్టు చట్ట సభల పరిధిని అతిక్రమించబోమని స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగం ద్వారా అధికారాల విభజన స్పష్టంగా ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చే అధికారం లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లలో పిటిషనర్లు ఏ వ్యక్తిగత కేసులోనూ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయవద్దని కేంద్రం సూచించింది.
ఇదిలా ఉంటే, ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ముస్లింలను హిందూ దేవాదాయ బోర్డుల్లోకి ఆహ్వానిస్తారా? అనే ప్రశ్నతో కేంద్ర వైఖరిపై చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల్లో నియామకాలు నిలిపివేయబడ్డాయని, అయితే చట్ట అమలులో ఎలాంటి మార్పు లేదని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ అంశం రాజ్యాంగబద్ధత, మతపరమైన హక్కులు, పరిపాలనా సమతుల్యత వంటి కీలక అంశాలను స్పృశిస్తోంది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. అయితే, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.
కాగా, ఈ నేపథ్యంలో, వక్ఫ్ కౌన్సిల్‌లో 22 మంది సభ్యులలో ఇద్దరు ముస్లిమేతరులను చేర్చడాన్ని కేంద్రం సమ్మిళితత్వానికి ఉదాహరణగా అభివర్ణించింది. ఇది వక్ఫ్ పరిపాలనలో జోక్యం కాదని, సమాజంలోని ఇతర వర్గాలకూ ప్రతినిధిత్వం కల్పించేందుకేనని వివరించింది. ఇక, వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 72 పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు దీనిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం తెలిపింది.