Site icon HashtagU Telugu

Hindutva : ‘సోషలిస్ట్‌’, ‘సెక్యులర్‌’ పదాలను తొలగించాలా ? పిటిషనర్లపై ‘సుప్రీం’ ఆగ్రహం

Supreme Court Hindutva Constitutionalism

Hindutva : భారత రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్‌ (సామ్యవాద), సెక్యులర్‌ (లౌకిక) పదాలను తొలగించాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో సోషలిస్ట్‌ (సామ్యవాద), సెక్యులర్‌ పదాలు ముఖ్యమైనవని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  వాటిని రాజ్యాంగం నుంచి తొలగించాలనే ఆలోచన కూడా సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం(Hindutva) అభిప్రాయపడింది. భారత్ లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అని పిటిషనర్లను ఈసందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ ప్రశ్నించింది.

Also Read :Adar Poonawalla : బాలీవుడ్‌లోకి వ్యాక్సిన్ తైకూన్.. కరణ్ జోహర్‌ కంపెనీలో రూ.1000 కోట్ల పెట్టుబడి

‘‘రాజ్యాంగంలోని ‘సోషలిజం’ అనే పదం వల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. దేశ ప్రజల్లో సమానత్వ భావన ఏర్పడుతుంది. రాజ్యాంగంలోని ‘సెక్యులర్‌’ అనే పదం కూడా దేశాన్ని కలిపి ఉంచుతుంది. ఈ పదాలను మీకు నచ్చిన కోణంలో చూడకండి. రాజ్యాంగం వాటిని నిర్దిష్ట నిర్వచనాలు ఇచ్చింది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో చర్చ జరగలేదని పిటిషనర్‌, న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ సుప్రీంకోర్టు బెంచ్‌కు తెలిపారు. ‘‘సోషలిజం, సెక్యులర్ అనే  పదాలకు వివిధ వివరణలు ఉన్నాయి. కానీ కొందరు వేర్వేరుగా అన్వయించుకుంటున్నారు. కోర్టులు ఈ పదాలను రాజ్యాంగంలోని ప్రాథమిక భాగాలుగా పలుమార్లు అభివర్ణించాయి. ఈవిషయాన్ని మీరు గుర్తుంచుకోండి’’ అని పిటిషనర్‌కు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచించారు. ‘‘42వ రాజ్యాంగ  సవరణ అమల్లోకి వచ్చేనాటికి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు’’ అని మరో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టుకు గుర్తు చేశారు. దీనికి న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా బదులిస్తూ.. ‘‘మన భారత్ లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? ’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌‌ను  ప్రశ్నించారు.  దీనికి ఇంకో పిటిషనర్ విష్ణు శంకర్‌ జైన్‌ బదులిస్తూ.. ‘‘భారత్‌ లౌకిక దేశంగా ఉండకూడదని మేం చెప్పడం లేదు.  ఆ సవరణను మాత్రమే సవాలు చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.

Also Read :Australia Vs King : బ్రిటన్ రాజుకు షాక్.. ఆదివాసీ సెనెటర్‌ ఏం చేసిందంటే..

‘‘భారత రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం, సోషలిజం పదాలు చేర్చడానికి భారత ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదు. రాజ్యాంగ పీఠికలోని రెండు భాగాల్లో ఒకచోట తేదీతో, మరోచోట తేదీ లేకుండా ఉంచవచ్చు’’ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. రాజ్యాంగ పీఠికలో 26 నవంబర్‌ 1949వ తేదీని పొందుపర్చడం తప్పని నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. పిటిషనర్లు సంబంధిత పత్రాలను సమర్పిస్తే పరిశీలిస్తామని జస్టిస్‌ ఖన్నా  చెప్పారు. తదుపరి వాదనలను నవంబర్‌ 18కి వాయిదా వేసింది.