Site icon HashtagU Telugu

NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు

NEET Paper Leak Case

NEET-UG 2024 : ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్‌ యూజీ 2024’ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా గురువారం నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీ‌ఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల గణనలో  చోటుచేసుకున్న అవకతవకలపై జులై 8లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join

లెర్నింగ్ యాప్ కంపెనీ పిటిషన్‌

నీట్‌-యూజీ మార్కుల గణనలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ ఒక లెర్నింగ్ యాప్ కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నీట్ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్‌ షీట్లను కూడా పొందలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఇవాళ ఈ పిటిషన్‌ను విచారించింది. ‘‘ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడానికి ఏమైనా టైమ్‌లైన్‌ను మీరు పెట్టుకొన్నారేమో తెలియజేయండి. దీనిపై ఎన్‌టీఏను స్పందించనీయండి’’ అని సుప్రీంకోర్టు బెంచ్‌ పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ ఈ అంశంపై జులై 8లోగా వివరణలు అందజేయాలని కోరింది.

కోచింగ్ సెంటర్ల  పాత్రపై కీలక వ్యాఖ్యలు

కోచింగ్‌ సెంటర్లు పిటిషన్లు దాఖలు చేయడాన్ని ఈసందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘ఇది కోచింగ్‌ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32వ పిటిషన్‌. ఇందులో మీ ప్రాథమిక హక్కులకు జరిగిన ఉల్లంఘన ఏముంది ? ఈ అంశంలో కోచింగ్ సెంటర్ల వారు పోషించడానికి ఏ పాత్ర కూడా కనిపించడం లేదు. చెప్పిన సేవలు అందించడంతోనే వారి పాత్ర ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను వారు చూడాల్సిన అవసరం లేదు’’ అని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. నీట్‌-యూజీ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన మిగిలిన పిటిషన్లతో కలిపి జులై 8వ తేదీనే విచారణ నిర్వహిస్తామని కోర్టు తెలిపింది.

Also Read :Sunita Williams : ‘అంతరిక్షం’లోనే సునీత.. తిరుగు ప్రయాణం ఇంకా లేట్

సీబీఐ దర్యాప్తు వేగవంతం

నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారంపై సీబీఐ కూడా ముమ్మర  దర్యాప్తు చేస్తోంది. నీట్‌ లీకులకు సంబంధించి దాఖలైన అనుబంధ కేసులను అది ప్రస్తుతం పరిశీలిస్తోంది. బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై సీబీఐ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. నీట్ అవకతవకల వ్యవహారంలో ఆ రాష్ట్రాలు కేంద్రంగా పేపర్ లీక్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాల గుట్టును రట్టు చేసే దిశగా సీబీఐ టీమ్స్ అడుగులు వేస్తున్నాయి.