Supreme Court: కర్ణాటకలో రాజకీయాలకు తెరలేపిన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కుంభకోణం కేసులో, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురైంది. సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేసిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
Read Also: PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ..దురదృష్టవశాత్తూ మాకు మహారాష్ట్రలో ఇదే తరహా అనుభవం ఉంది. మేము మాట్లాడేటట్లు ఒత్తిడి చేయొద్దు. అలా చేస్తే ఈడీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సివస్తుంది అని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పోరాటాలు జరగటం సహజం. కానీ వాటికోసం అధికార సంస్థలను ఎందుకు వాడుతున్నారు? అని ఆయన అడిగారు. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు స్పందిస్తూ, ఈడీ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటుందని ప్రకటించారు. తద్వారా, కోర్టు పిటిషన్‌ను అధికారికంగా తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎటువంటి తప్పులేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వివాదం యొక్క మూలం 2021లో మొదలైంది. మైసూరు జిల్లా కెసరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి చెందిన మూడు ఎకరాల భూమిని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా స్వాధీనం చేసుకుంది. భూమి నష్ట పరిహారంగా ముడా, విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను ఆమెకు కేటాయించింది.
అయితే విజయనగరలో భూమి ధరలు కెసరెతో పోల్చితే చాలా ఎక్కువ కావడంతో, ఇది వివాదానికి దారితీసింది. ఆపై పార్వతి తనకు కేటాయించిన భూమిని స్వచ్ఛందంగా తిరిగి ముడాకు అప్పగించారు. అయినప్పటికీ ఈడీ ఈ వ్యవహారంలో ఆమెపై సమన్లు జారీ చేసింది. దీనిపై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఈడీ సమన్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. తాజాగా, సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ ఈడీ అప్పీల్‌ను కొట్టివేయడం ముఖ్య పరిణామంగా మారింది. ఇది కేవలం చట్టపరమైన విషయమే కాకుండా, రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ తీర్పుతో కేంద్ర సంస్థలు ఎలా పని చేస్తున్నాయన్న ప్రశ్న మరోసారి వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్ష నేతలపై మార్గదర్సిగా వాడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో, ఈ తీర్పు ప్రభుత్వం తీరుపై విమర్శలకు వేదిక కల్పించేలా ఉంది.
Read Also: Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు వివరణ