Waqf UPDATE : ‘వక్ఫ్ సవరణ చట్టం -2025’ గత వారమే పార్లమెంటు ఆమోదం పొందింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21, 25, 26, 29, 30, 300-Aలకు వ్యతిరేకంగా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పిటిషన్లపై అత్యవసర విచారణకు ఆయన అంగీకారం తెలిపారు. సదరు పిటిషన్ల లిస్టింగ్‌కు అనుమతి మంజూరు చేశారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్న ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఉన్నారు.
Also Read :Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
పిటిషన్లు వేసింది వీరే..
‘వక్ఫ్ సవరణ చట్టం -2025’ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో.. జమియత్ ఉలమాయె హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావెద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, సమస్త కేరళ జమియతుల్ ఉలెమా సంస్థ, అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ ఉన్నాయి. ఈ సంస్థలు, నేతల తరఫున వారివారి న్యాయవాదులు పిటిషన్లను(Waqf UPDATE) సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
సానుకూలంగా స్పందించిన సీజేఐ..
ఇవాళ(సోమవారం) ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ లేవనెత్తారు. ఆయన జమియత్ ఉలమాయె హింద్ తరఫున పిటిషన్ వేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ‘‘మేం కేసులను అత్యవసర విచారణకు చేపట్టాలని.. మీరు మౌఖికంగా చెబితే కుదరదు. సమగ్ర వివరాలతో లేఖ లేదా మెయిల్స్‌ను పంపాలి’’ అని నిర్దేశించారు. దీనికి కపిల్ సిబల్ బదులిస్తూ.. ‘‘మేం ఆ ప్రక్రియను పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘అయితే నేను ఆ లేఖలను మధ్యాహ్నం చూసి, తగిన నిర్ణయం తీసుకుంటాను. వాటిని లిస్ట్ చేయిస్తాను’’ అని సీజేఐ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయా పిటిషన్లపై అత్యవసర విచారణకు లైన్ క్లియర్ అయింది. మరో కీలక విషయం ఏమిటంటే.. ‘వక్ఫ్ సవరణ చట్టం -2025’ను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తేకుండా ఆపాలంటూ జమియత్ ఉలమాయె హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ మధ్యంతర పిటిషన్ కూడా వేశారు.