Supreme Court : ‘‘టీనేజీ బాలికలు తమ లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవాలి’’ అంటూ గతేడాది కోల్‌కతా హైకోర్టు ధర్మాసనం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఆ వివాదాస్పద తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కొట్టివేసింది. ఆ కేసులో నిందితుడికి వేసిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
ఏమిటా కేసు ?
కోల్‌కతా హైకోర్టు ధర్మాసనం ఆనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి దారితీసిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలను అతడిపై నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సదరు వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. 2023 సంవత్సరం అక్టోబరులో ఈ కేసుపై కోల్‌కతా హైకోర్టు విచారణ జరిపింది. సదరు వ్యక్తితో బాలిక ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రాతిపదికన కేసును ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా తేలుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగానే హైకోర్టు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం పాకులాడితే బాలికలు సమాజం దృష్టిలో పరాజితులుగా మిగిలిపోతారు. టీనేజీ బాలికలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలి’’ అని హైకోర్టు బెంచ్ సూచించింది.
Also Read :Infosys Power : ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ‘పవర్’ న్యూస్.. రూ.9 లక్షల దాకా శాలరీ ప్యాకేజీ
హైకోర్టు ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నిర్దోషిగా తేల్చి హైకోర్టు విడుదల చేయడంపై పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. అప్పట్లో ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు బెంచ్‌కు మొట్టికాయలు వేసింది. న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చేటప్పుడు ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదని హితవు పలికింది. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది.నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు వ్యక్తి దోషి అని తేలినందున అతడి శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈసందర్భంగా తీర్పులను కోర్టులు ఎలా రాయాలన్న దానిపై మార్గదర్శకాలను జారీ చేశామని సుప్రీంకోర్టు చెప్పింది.