Site icon HashtagU Telugu

Supreme Court: అత్యాచార నిర్థారణకు ఆ టెస్టులు చేయొద్దు.. సుప్రీం కీలక తీర్పు!

Supreme Court

Supreme Court: అత్యాచార బాధితులకు నిర్వహించే టూ ఫింగర్ టెస్ట్‌లపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయ్యింది.సమాజంలో ఇప్పటికీ ఇవి కొనసాగుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. రెండు వేళ్ల పరీక్ష అనేది మహిళల గోప్యత, గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తుందని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. ఇలాంటి పరీక్షలు ఎవరు చేసినా.. దుష్ప్రవర్తన నేరం కింద పరిగణించాలని స్పష్టంచేసింది.

అత్యాచారం, హత్య కేసులో నేరస్థుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అతడిని దోషిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. టూ ఫింగర్ టెస్ట్ మహిళల గౌరవం, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని దశాబ్దకాలం క్రితమే సుప్రీం కోర్టు తన తీర్పు ప్రకటించిందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ విధానం అమలులో ఉండటం దురదృష్టకరం.. యోని లాక్సిటీని పరీక్షించే ప్రక్రియ మహిళల గౌరవాన్ని భంగపరుస్తుంది. అలాగే లైంగికంగా యాక్టివ్‌గా ఉన్న మహిళపై రేప్ జరగదని చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల పాఠ్యాంశాల నుంచి టూ ఫింగర్ టెస్ట్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రానికి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులను ఆదేశించింది. అత్యాచార బాధితురాలికి రెండు వేళ్ల పరీక్ష ఆమె గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని మే 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లైంగిక వేధింపులను నిర్ధారించడానికి మెరుగైన వైద్య విధానాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.