Site icon HashtagU Telugu

Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court angry with YouTuber

Supreme Court angry with YouTuber

Ranveer Allahbadia : యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్స‌ర్‌ ర‌ణ్‌వీర్ అల్లాబ‌దియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా..? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ మెదడులోని చెత్తనంతా ఆ ప్రోగ్రామ్ ద్వారా బయటపెట్టారు. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీం ప్రశ్నించింది.

Read Also: Jagan : వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు

జ‌స్టిస్ సూర్య కంత్‌, జ‌స్టిస్ కోటీశ్వ‌ర్ సింగ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ అల్లాబ‌దియా కేసులో ఈ వ్యాఖ్య‌లు చేసింది. స‌మాజ విలువ‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవ‌రికీ లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోద‌రీమ‌ణులు, పేరెంట్స్‌, స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకుంటోంద‌ని యూట్యూబ‌ర్ అల్లాబ‌దియాపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. స‌మాజానికి ఉన్న విలువ‌లు, వాటి ప‌రిమితిలు నీకు తెలుసా అని కోర్టు అత‌న్ని ప్ర‌శ్నించింది. స‌మాజానికి కొన్ని విలువ‌లు ఉన్నాయ‌ని, వాటిని గౌర‌వించ‌డం నేర్చుకోవాల‌ని కోర్టు చెప్పింది. భావ‌స్వేచ్ఛ పేరుతో.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం స‌రికాదు అని కోర్టు తెలిపింది.

ఆ తర్వాత రణ్‌వీర్‌ సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణ్‌వీర్‌ను హెచ్చరించింది. అలాగే యూట్యూబర్ తన పాస్‌పోర్టును మహారాష్ట్రలోని ఠాణె పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చిచెప్పింది.

కాగా, ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని ఓ యూట్యూబ్ షోలో.. పేరెంట్స్ సెక్స్ గురించి ర‌ణ్‌వీర్ అల్లాబ‌దియా జుగుప్సాక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సమయ్‌ రైనా షోలో రణ్‌వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ క్లబ్‌ చేయాలని ఓ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దానిపైనే తాజాగా విచారణ జరిగింది.

Read Also: Gold Rush : ట్రంప్ ఎఫెక్ట్.. విమానాల్లో బంగారాన్ని తెప్పిస్తున్న బ్యాంకులు