Supreme Court – Abortion : గ్యాంగ్ రేప్ కు గురై గర్భం దాల్చిన ఓ మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. బాధిత మహిళ వ్యథ, వైద్య రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని.. 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఆమెకు పర్మిషన్ మంజూరు చేసింది. ఈ కేసులో బాధిత మహిళ అబార్షన్ కు గుజరాత్ హైకోర్టు అనుమతించకపోవడం సరికాదని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. “ఓ మహిళ లైంగిక దాడిని ఎదుర్కోవడమే అత్యంత బాధాకరమంటే.. దాని ఫలితంగా ఆమె గర్భం దాల్చడం కోలుకోలేని గాయమే అవుతుంది. ఆ పరిస్థితి తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది” అని పేర్కొంది.
Also read : 8 Seconds – 118 Elements : స్పీడ్ అంటే ఇదే.. 8 సెకన్లలోనే 118 రసాయన మూలకాలను చదివేసింది
అబార్షన్ కోసం రేపే ఆసుపత్రిలో చేరాలని ఆ మహిళను ఆదేశించింది. ఒకవేళ అబార్షన్ (Supreme Court – Abortion) సమయంలో పిండం సజీవంగా ఉంటే.. ఇంక్యుబేషన్‌లో పెట్టి సంరక్షించాలని సూచించింది. ఆ తర్వాత చట్టప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని వెల్లడించింది. అబార్షన్ చేయించుకునే పర్మిషన్ కోసం బాధిత మహిళ తొలుత ఆగస్టు 7న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే వైద్య నివేదికల కోసం తాత్సారం చేస్తూ.. గుజరాత్ హైకోర్టు ఈ కేసును ఆగస్టు 23కు వాయిదా వేసింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.