Food poisoning : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం కేకేట్ జల్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార భోజన పథకం కార్యక్రమంలో భాగంగా బిస్కెట్లు ఇచ్చారు. అవి తిన్న తర్వాత వికారం, వాంతులతో విద్యార్థులు అస్వస్థత చెందారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, ఇతర అధికారులు వెంటనే ఆ పాఠశాలకు చేరుకున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గ్రామీణ ఆస్పత్రికి తరలించారు. బిస్కెట్లు తిన్న తరువాత స్కూల్లోని 257 మంది విద్యార్థుల్లో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయని ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ తెలిపారు.
ఉదయం 8.30 గంటలకు 153 మంది బడి పిల్లలను ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు చెప్పారు. మరోవైపు చికిత్స తర్వాత పలువురు విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. సుమారు 80 మందికి గ్రామీణ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తీవ్ర లక్షణాలున్న ఏడుగురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.