Governor Statue : పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సంచలనాలకు మారుపేరు !! తాజాగా ఆయన మరో సంచలనం చేశారు. కోల్‌కతాలో తాను ఉండే బెంగాల్ రాజ్ భవన్‌లో తన విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయించారు. ఇవాళ ఉదయం తన విగ్రహాన్ని స్వయంగా గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆనందోత్సాహాలతో ఆవిష్కరించారు. బెంగాల్ గవర్నర్‌గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తన విగ్రహన్ని ఏర్పాటు చేయించినట్లు ఆయన వెల్లడించారు. గవర్నర్ విగ్రహాన్ని ఇండియన్ మ్యూజియం కళాకారుడు పార్థ సాహా కేవలం వారం రోజుల వ్యవధిలో తయారుచేసి అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్‌భవన్‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాజ్‌భవన్ నుంచి వందలాది మందికి ఆహ్వానాలు పంపగా, వాటిలో సీఎం మమతా బెనర్జీ పేరు లేకపోవడం గమనార్హం. బెంగాల్‌లోని టీఎంసీ సర్కారు, గవర్నర్ ఆనంద్ బోస్(Governor Statue)కు మధ్య మొదటి నుంచే పెద్ద గ్యాప్ ఉంది. సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ఇద్దరూ చాలాసార్లు బహిరంగంగా విమర్శలు గుప్పించుకున్నారు.
Also Read :Maharashtra CM : దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారంటున్న బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే రియాక్షన్ ఇదీ
ఇవాళ బెంగాల్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో రాజకీయాలతో సంబంధం లేని వారి పేర్లే ఉండటం గమనార్హం. రాజకీయాలతో సంబంధమున్న వారిని ఎందుకు పిలవలేదని గవర్నర్ ఆనంద్ బోస్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనది. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇక అంశంపై బెంగాల్‌లోని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం ఏర్పాటును టీఎంసీ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ విగ్రహాన్ని గవర్నరే ఏర్పాటు చేయించుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇలా చేయడం నిధుల దుర్వినియోగానికి పాల్పడటమే అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం గవర్నర్ పాకులాడుతున్నారని సీపీఎం, టీఎంసీ నేతలు తెలిపారు.