Chhatrapati Shivaji Statue : ఛత్రపతి శివాజీ.. భారత వీరత్వానికి ప్రతీక. మరాఠా గడ్డ గర్వించేలా భారతావని కోసం పోరుసలిపిన వీర యోధుడు శివాజీ. ఆ మహా యోధుడిని దేశం నిత్యం స్మరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి భారతదేశ సైనికులకు శివాజీ స్ఫూర్తి ప్రదాత. ఆయన లాంటి దేశభక్తుల నుంచి భారత సైనికులు వీరత్వం, దేశభక్తి సుగంధాలను పొందుతుంటారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే.. తూర్పు లడఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ జనరల్ హితేష్ భల్లా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Also Read :CR450 Bullet Train : చైనా దూకుడు.. ప్రపంచంలోనే స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ‘సీఆర్450’ రెడీ
చైనాతో భారత్ సరిహద్దు వివాదం ఇటీవలే సమసిపోయింది. దీంతో దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు ఇరుదేశాల నడుమ కొనసాగిన సరిహద్దు ప్రతిష్టంభనకు తెరపడింది. దెమ్‌చోక్, డెప్సాంగ్‌ల నుంచి భారత్, చైనా తమ సైన్యాలను వెనక్కి తీసుకున్నాయి. ఈ తరుణంలో తూర్పు లడఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Also Read :Manmohan Daughters : మన్మోహన్‌సింగ్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు ?
ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Statue) 17 ఏళ్ల వయసులోనే కత్తి పట్టారు. వెయ్యి మంది సైన్యంతో ఆయన బీజాపూర్‌పై దాడి చేసి.. తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే రాజ్‌ఘడ్, కొండన ప్రాంతాలను కైవసం చేసుకున్నారు. పూణే ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ‘‘ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి’’ అనే యుద్ధ సూత్రాన్ని శివాజీ నమ్మేవారు. దీన్నే ఇప్పుడు గెరిల్లా యుద్ధ తంత్రం అని పిలుస్తున్నారు. గెరిల్లా యుద్ధం చేసేవారు కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తుంటారు. మొత్తం మీద సైన్యంపై, యుద్ధ వ్యూహాలపై శివాజీకి మంచి పట్టు ఉండేది. అందుకే మన దేశ బార్డర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆర్మీ ఏర్పాటు చేయించింది.