Ration Cards : మన దేశంలోని రేషన్ కార్డుల వ్యవస్థపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది. రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారిపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మండిపడింది. పేరుకు మాత్రమే రాష్ట్రాలు రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయని, సబ్సిడీలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందడం లేదని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాయితీతో పేదలకు నిత్యావసరాలను సప్లై చేస్తున్నామని రాష్ట్రాలు చెబుతున్నప్పటికీ, అవి అర్హులైన లబ్దిదారులకు అందడం లేదని పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై నమోదైన సుమోటో కేసును ఇవాళ(బుధవారం) విచారించే క్రమంలో సుప్రీంకోర్టు(Ration Cards) ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
Also Read :Smita Sabharwal : స్మితా సభర్వాల్‌కు రేపోమాపో నోటీసులు.. కారణం అదే
కరోనా టైంలో..
కరోనా టైంలో అనేక మంది వలస కార్మికులు రేషన్ కార్డులతో ప్రయోజనం పొందలేకపోయారని ఈసందర్భంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ఇది నిజమైన సమస్య, పేదలు, అర్హులైన వారంతా రేషన్‌ను పొందేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది. రేషన్ కార్డులతో అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ప్రయోజనాలు పొందుతున్నారని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. పౌర సరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో రూ.5, 734 కోట్లు కేటాయించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. నూతన రేషన్ కార్డుల జారీ, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించామని శాసన సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, ఇంటి కరెంట్బిల్లులను తప్పనిసరిగా జతపర్చాలని కోరారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లను జతపర్చాలి అని భావించేవారు.. వారి ఆధార్ కార్డును జతపర్చాలని సూచించారు.