Site icon HashtagU Telugu

Srilanka Emergency: ‘లంకేయులకు’ ఎంత కష్టమొచ్చే!

Srilanka

Srilanka

కరోనా మహమ్మారి విసిరిన పంజా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీలంక. ఆ దేశంలోని రాజపక్స ప్రభుత్వం అనుసరించిన విధానాలకు కరోనా మహమ్మారి తోడైంది. ఆ దేశ ఆదాయ వనరులో కీలకమైన పర్యాటకం పడకేసింది. దీంతో ఆ దేశ పరిస్థితి మరింత దారుణంగా మారింది. తీవ్రమైన ఆహార సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ దేశంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధిస్తూ…ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి దేశంలో అత్యవసర పరిస్థితులు అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఆహార సంక్షోభంతో మొదలైన సమస్య పెరిగిపోవడమే కాదు..ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసే వరకు వెళ్లింది. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో ఆహార పదార్థాల కొరత…విద్యుత్ కోతలు…ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. దీంతో ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు. ఆందోళన చేపడుతున్నారు. నిరసన గళం విప్పుతున్నారు. గురువారం వేలాది మంది దేశాధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టారు.

కాగా అధ్యక్షస్ధానం నుంచి రాజపక్స తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో హింసాత్మక ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. భద్రతా దళాలతోపాటు పోలీసులు పెద్దెత్తున గాయపడ్డారు. రాజధాని కొలంబోలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు దేశాధ్యక్షుడు తన అమ్ముల పొదిలోని అత్యవసర పరిస్థితిని బయటకు తీశారు. ప్రజల భద్రత..అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాలకు సంబంధించి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా శ్రీలంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.