Spying Bird: కర్ణాటకలోని కారువార్ తీరం సమీపంలో చైనీస్ జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక సీగల్ (సముద్ర పక్షి) కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ పక్షి దొరికిన ప్రాంతానికి అతి సమీపంలోనే భారత నౌకాదళానికి చెందిన అత్యంత కీలకమైన INS కదంబ బేస్ ఉండటమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. ఉత్తర కన్నడ జిల్లాలోని తిమ్మక్క గార్డెన్ సమీపంలో ఈ పక్షి కనిపించింది. పక్షి వీపుపై ఏదో వింత వస్తువు ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో భద్రతా సంస్థలు, స్థానిక పరిపాలన విభాగం అప్రమత్తమయ్యాయి.
గూఢచర్యమా లేక పరిశోధననా?
అధికారులు పక్షిని పట్టుకుని పరిశీలించగా దానిపై ఉన్న GPS ట్రాకర్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి చెందిన ‘ఎకో-ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్’కు చెందినదిగా గుర్తించారు. సాధారణంగా వలస పక్షుల కదలికలు, వాటి ఆహారపు అలవాట్లు, ప్రయాణ మార్గాలను అధ్యయనం చేయడానికి పరిశోధకులు ఇటువంటి పరికరాలను ఉపయోగిస్తారని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
ప్రాథమిక విచారణలో ఇది కేవలం పరిశోధన ప్రాజెక్టులో భాగమేనని అనిపిస్తున్నప్పటికీ అధికారులు సాంకేతిక విశ్లేషణ కోసం పరికరాన్ని పంపారు. దీనిపై పూర్తి వివరాల కోసం సదరు చైనీస్ సంస్థను కూడా సంప్రదిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ పక్షి కర్ణాటక తీరానికి చేరుకోవడానికి ముందు ఆర్కిటిక్ ప్రాంతాల మీదుగా 10,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు డేటా ద్వారా తెలిసింది.
అలజడికి అసలు కారణం ఇదే!
ఈ పక్షి దొరికిన ప్రదేశం భద్రతా పరంగా చాలా కీలకం. INS కదంబ నేవీ బేస్ భారత నౌకాదళానికి వ్యూహాత్మక కేంద్రం. ఇక్కడ విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలను ఉంచుతారు. ప్రస్తుతం ఈ బేస్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే తూర్పు అర్ధగోళంలోనే INS కదంబ అతిపెద్ద నౌకాదళ స్థావరంగా అవతరిస్తుంది. అందుకే ఈ పరికరం ఏదైనా గూఢచర్యానికి సంబంధించినదా అనే కోణంలో భద్రతా సంస్థలు ఆందోళన చెందాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
గతంలో నవంబర్ 2024లో కూడా కారువార్‌లోని బైత్‌కోల్ ఓడరేవు సమీపంలో ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక ‘వార్ ఈగిల్’ కనిపించింది. అప్పుడు కూడా లోతుగా దర్యాప్తు చేయగా అది వైల్డ్‌లైఫ్ రీసెర్చ్‌కు సంబంధించినదిగానే తేలింది.
