Nitish Kumar : నితీష్ గ‌రంగ‌రం, ఎన్డీయేలో చీలిక‌?

ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో బ‌లంగా క‌నిపిస్తోన్న ఎన్డీయే చీలిక దిశ‌గా వెళుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూట‌మికి దూరం జ‌రుగుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 8, 2022 / 12:30 PM IST

ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో బ‌లంగా క‌నిపిస్తోన్న ఎన్డీయే చీలిక దిశ‌గా వెళుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూట‌మికి దూరం జ‌రుగుతున్నారు. అందుకు ఆదివారం జ‌రిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్న‌ర్ కౌన్సిల్ స‌మావేశం నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని ప్ర‌త్యేకంగా హోం మంత్రి అమిత్ షా కోరిన‌ప్ప‌టికీ ఆయ‌న డుమ్మా కొట్టారు. నీతి ఆయోగ్ తో స‌హా జులై 17 నుంచి కేంద్రం చేప‌ట్టిన నాలుగు స‌మావేశాల‌కు నితీష్‌ హాజ‌రుకాలేదు. ఈ నెల 11వ తేదీలోపు బీహార్‌లో ఎన్డీఏ ప్ర‌భుత్వం కూలిపోయే అవ‌కాశం ఉంద‌ని జేడీయూ వ‌ర్గాల్లోని వినికిడి. మాజీ మిత్రపక్షమైన ఆర్జేడీతో తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ కేంద్రంగా న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

జేడీయూ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది మ‌ధ్యంత‌ర‌ ఎన్నికలకు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. , రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు కోసం నితీష్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. నితీష్ మంగళవారం పాట్నాలో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. జేడీయూకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ ఈ సమావేశానికి పిలిచినట్లు తెలుస్తోంది. ఈ భేటీ త‌ర్వాత ఎన్డీఏ నుంచి వైదొలిగే అవ‌కాశం ఉంద‌ని బీహార్ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌. కాగా, ఎన్డీయేకు మరో మిత్రపక్షమైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా మంగ‌ళ‌వారం తమ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర అభివృద్ధి ర్యాంకింగ్స్‌లో బీహార్‌ను అట్టడుగున ఉంచిన నీతి ఆయోగ్‌పై కుమార్ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు, గత నెలలో, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు కూడా ఆయ‌న దూరంగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచిన ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా డిప్యూటీ సీఎంను పంపారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ, నితీష్‌ కుమార్ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్య‌త‌లు తీసుకున్న కొన్ని రోజుల‌కు బీజేపీతో నితీష్ కుమార్ విభేదాలు మొదలయ్యాయి. ఇప్పుడు, అగ్నిపథ్ పథకం, కుల గణన, బిజెపికి చెందిన బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాతో నితీష్ పొస‌గ‌డంలేదు. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య ఎన్డీయే చీలిపోనుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది. కేవ‌లం జేడీయూ, హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీలే కాదు, రాబోవు రోజుల్లో మ‌రిన్ని పార్టీలు ఎన్డీయేకు గుడ్ బై చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నాయ‌ని నితీష్ సంకేతాలు ఇస్తున్నార‌ట‌.