Parliament Special Session : ఈరోజు నుంచి సెప్టెంబరు 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ తొలిరోజున 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చ ఉంటుందని అంటున్నారు. వినాయక చవితి శుభ ముహూర్తంలోరేపు (మంగళవారం) ఉదయాన్నే పార్లమెంటు కార్యకలాపాలు.. కొత్త పార్లమెంటు భవనంలోకి మారనున్నాయి. దీనికి ముందస్తు సూచికగా.. కొత్త పార్లమెంటు భవనం వద్ద ఆదివారం ఉదయాన్నే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక ఈ సెషన్ లో రాజ్యసభలో 3 బిల్లులు, లోక్‌సభలో 4 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని బిల్లులను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఆమోదించగా.. లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉంది.
Also read : Rain Alert : ఈనెల 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు.. ఎక్కడంటే ?
ప్రవేశపెట్టేది ఈ బిల్లులే..
లోక్ సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుల జాబితాలో అడ్వకేట్స్ (సవరణ) బిల్లు- 2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్ బిల్లు-2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు-2023, ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారులు (నియామకం, సర్వీస్ నిబంధనలు) బిల్లు-2023 ఉన్నాయి. రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో రిపీలింగ్ అండ్ అమెండ్‌మెంట్ బిల్లు-2023, పోస్టల్ బిల్లు, ఎన్నికల అధికారులు (నియామకం, సర్వీస్ నిబంధనలు) బిల్లు-2023 ఉన్నాయి. ఈ సెషన్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
సీక్రెట్ ఎజెండా ఉందంటూ ఆరోపణలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటి? అనే దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఇది సాధారణ పార్లమెంటు సెషన్ మాత్రమే అని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పదేపదే చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన అఖిల పక్ష భేటీలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ ఈ సెషన్ కు సంబంధించి మోడీ సర్కారుకు ఏదో సీక్రెట్ ఎజెండా ఉందని విపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయి. ఈ సెషన్ లో ఏవైనా సంచలన బిల్లులను, సంచలన తీర్మానాలను చేసే ఛాన్స్ ఉందని వాదిస్తున్నారు. ఈ సెషన్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ అంశంపై ఏర్పాటుచేసిన కమిటీ సమావేశం పార్లమెంటు సెషన్ ముగిసిన మరుసటి రోజు (సెప్టెంబరు 23న) ఉంది. ఆ కమిటీ చాలా కసరత్తు చేయాల్సి ఉంది. బహుశా నవంబరు లేదా డిసెంబరులో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మిగిలిన వివాదాస్పద అంశాల జాబితాలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు, మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ కు మార్చే తీర్మానం ఉన్నాయి. వీటిపై ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠను (Parliament Special Session) రేకెత్తిస్తోంది.