ED Notices to Gandhis: సోనియా, రాహుల్ లకు ఈడీ నోటీసులు.. ఏమిటీ “నేషనల్ హెరాల్డ్” కేసు ?

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. జూన్ 8న తమ ఎదుట హాజరు కావాలంటూ సోనియాగాంధీకి..

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 07:33 PM IST

“నేషనల్ హెరాల్డ్” పత్రిక కేసులో
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. జూన్ 8న తమ ఎదుట హాజరు కావాలంటూ సోనియాగాంధీకి.. జూన్ 2న హాజరు కాలంటూ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరం నాటి “నేషనల్ హెరాల్డ్” పత్రిక కేసులో మనీలాండరింగ్ అభియోగాలను రాహుల్, సోనియా ఎదుర్కొంటున్నారు. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున .. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు అదనపు గడువు కావాలని కోరినట్లు సమాచారం.

కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి, రణ్ దీప్ సూర్జేవాలా ఈవిషయాన్ని చెప్పారంటూ పలు మీడియా సంస్థలు కథనాన్ని ప్రచురించాయి. “భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర బీజేపీ వ్యవస్థాపక నాయకులకు లేదు. వాళ్ళ వారసత్వాన్ని మోడీ నేతృత్వంలోని బీజేపీ కొనసాగిస్తోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను లక్ష్యంగా చేసుకోవడం అంటే.. స్వాతంత్ర్య సంగ్రామ యోధులను అవమానించడంతో సమానం” అని రణ్ దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. “1942 సంవత్సరం లో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభమైంది. అప్పట్లో బ్రిటీష్ వాళ్ళు దాని గొంతు నులిమే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈడీని అస్త్రంగా వాడుకొని అలాంటి పనులే చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. “మనీలాండరింగ్ అనేదే జరగనప్పటికీ.. మనీ లాండరింగ్ కేసును పెట్టడం దారుణం. రాజకీయ దురుద్దేశం, ప్రతీకార వైఖరితోనే ఇలా చేస్తున్నారు” అని సూర్జేవాలా కామెంట్స్ చేశారు.

ఏమిటీ నేషనల్ హెరాల్డ్ ?

జవహర్ లాల్ నెహ్రూ తో పాటు పలువురు స్వాతంత్ర్య సమరయోధులు కలిసి 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. కాంగ్రెస్ లోని మితవాదుల భావజాలాన్ని వ్యాపింపజేసే ఉద్దేశంతో అది ఏర్పాటైంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) సంస్థ ఆధ్వర్యంలో దాని ప్రచురణ జరిగేది. స్వాతంత్ర్యం తర్వాత కూడా దాని ప్రచురణ కొనసాగింది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురితం అయ్యేది. అయితే అకస్మాత్తుగా 2008లో రూ.90 కోట్ల అప్పును లెక్కల్లో చూపించి ఆ పేపర్ ను మూసేశారు.

సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కడంతో..

వివాదాస్పద బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో ఈ వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది.రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ “యంగ్ ఇండియా లిమిటెడ్” ద్వారా.. మరో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ “అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్” (ఏజెఎల్) ను గాంధీ కుటుంబం కొనుగోలు చేసిందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. ఏజెఎల్ కు చెందిన భూమిని గాంధీ ఫ్యామిలీ ఆక్రమించుకుందని, ఆ సంస్థకు చెందిన కోట్లాది నిధులను కూడా దుర్వినియోగం చేస్తోందని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్” (ఏజెఎల్) లో వాటాదారులుగా ఉన్న చాలామంది తమకు తెలియకుండానే సంస్థ ను “యంగ్ ఇండియా లిమిటెడ్” కు అమ్మేశారని అప్పట్లో పేర్కొన్నారు. ఇలా చెప్పిన ప్రముఖుల్లో మాజీ న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్, మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తదితరులు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో
తమ తండ్రులకు ఉన్న షేర్లను.. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా 2010 సంవత్సరంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) కు బదిలీ చేశారని నాడు చెప్పారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ కు చెందిన దాదాపు రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను అడ్డదారిలో “యంగ్ ఇండియా లిమిటెడ్”కు కట్టబెట్టడం ద్వారా గాంధీ కుటుంబం అక్రమ లబ్ది పొందిందని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక ను నడిపించేందుకు ఏర్పడిన సంస్థ పేరు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ .

దీనికి తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ కొంత రుణాన్ని అందించింది. అయితే ఆ డబ్బును పార్టీ ఫండ్స్ నుంచి ఇచ్చినప్పుడు లోన్ అనడం చట్టరీత్యా చెల్లదని సుబ్రమణ్య స్వామి వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ బాకీపడ్డ రూ.90.25 కోట్లకుగానూ ..కేవలం రూ.50 లక్షలను “యంగ్ ఇండియా లిమిటెడ్” సంస్థ చెల్లించి నేషనల్ హెరాల్డ్ పై పూర్తి హక్కులు సొంతం చేసుకోవడం సరికాదని ఆయన అంటున్నారు. ఈ అంశాలపై ఈడీ విచారణ 2014 లో కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచే ప్రారంభమైంది.