Site icon HashtagU Telugu

Congress: ఇక త‌గ్గేదేలే అంటున్న‌ సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi Congress

దేశంలో ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజ‌యాన్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ప‌త‌న స్థాయికి చేరుకుందో అర్ధ‌మవుతోంది. క‌నీసం పంజాబ్‌లో అయినా అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు ఊహించ‌ని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఈ నేప‌ధ్యంలో కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు అక్కడ కూడా ప్రతికూల ఫలితాలు రావడం ఆ పార్టీ హైకమాండ్‌ జీర్ణించుకోలేకపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప‌రాభ‌వానికి గ‌ల కార‌ణాలు అన్వేషించే ప‌నిలో ప‌డింది. ఈ క్ర‌మంలో లోపాల‌ను చ‌క్క‌దిద్దే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సోనియా గాంధీ, 2024 నాటికి పార్టీని ప‌టిష్టం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

మొద‌ట ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్‌లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయ‌మ‌న్న సోనియా గాంధీ, అదే క్ర‌మంలో పార్టీ ఓటమి విశ్లేషణ కోసం ఐదుగురు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థిలను విశ్లేషించి, సంస్థాగతంగా చేయాల్సిన మార్పులనూ ఈ కమిటీ సూచన చేస్తుంది.

ఇందులోభాగంగా పార్టీ సీనియర్ నేత అజయ్ మకెన్‌‌కు పంజాబ్ బాధ్యతలను అప్పగించిన సోనియా గాంధీ, మణిపూర్ బాధ్యతలను జైరామ్ రమేష్, గోవాకు రజిని పాటిల్, ఉత్తరప్రదేశ్‌కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్‌కు అవినాష్ పాండేలను నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి, వారి నుంచి సమాచారం సేకరించి, వాస్తవిక‌ పరిస్థితులతోపాటు సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై వారు నివేదిక అందచేస్తారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అన్నా కాంగ్రెస్ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనా స్వ‌యంకృతాప‌రాధంతో ఎన్నిక‌ల్లో బోల్తా కొట్టిన త‌ర్వాత ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటే ఏం లాభ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.