Sonia Gandhi : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అయితే ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని సోనియా కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించారు. తన తల్లి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ‘బోరింగ్? నో కామెంట్స్? అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారా?’ అంటూ సోనియా గాంధీ మాటల భావాన్ని ప్రస్తావించారు.
అయితే ఈ కామెంట్స్‌పై అధికార పార్టీ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. ఈ వ్యాఖ్య దేశంలోని మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని అవమానించడమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ నీచ రాజకీయ స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని బీజేపీ సీనియర్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు రాష్ట్రపతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ద్రౌపది ముర్ము ఆదివాసీ కుటుంబానికి చెందినవారు. ఇప్పుడు ఆమె మన దేశంలో నంబర్ వన్ పౌరురాలు. కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదు. అందుకే వారు ఆమె ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా చేసిన కామెంట్స్‌ను తనతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి పదాలను ఉద్దేశపూర్వకంగా వాడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ పేద, గిరిజన వ్యతిరేక వైఖరి స్పష్టమైందన్నారు. గౌరవనీయులైన రాష్ట్రపతికి, భారతదేశంలోని గిరిజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జేపీ నడ్డా డిమాండ్ చేశారు.
Read Also: KCR Hot Comments: నేను కొడితే మాములుగా ఉండదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు