స్వాతంత్య్ర సమరయోధుల్ని, భారత సైన్యాన్ని కించపరిచేలా మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆరోపణలకు దిగారు. రాజకీయ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారత బలగాలు చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
చారిత్రక వాస్తవాలను తప్పుదోవ పట్టించడానికి గాంధీ-నెహ్రూ-ఆజాద్-పటేల్ వంటి వాళ్లపై దుష్ప్రచారాలకు మోడీ సర్కార్ పాల్పడుతోందని విమర్శించారు. ఆ విధంగా చేసే ప్రతి ప్రయత్నాన్ని భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది అని ఆమె అన్నారు. భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశానికి శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా గాంధీ ఇలా అన్నారు. “గత 75 సంవత్సరాలుగా, అత్యంత ప్రతిభావంతులైన భారతీయులు సైన్స్, విద్య, ఆరోగ్యం మరియు సమాచార రంగాలలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. భారతదేశం దార్శనిక నాయకులు స్వేచ్ఛా, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థకు పునాదులు వేశారు. వారు బలమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థల కోసం నిబంధనలను కూడా చేసారని ఆమె కొనియాడారు.