Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ వార్త ప్రచురితం అయ్యే సమయానికి ఎన్డీయే కూటమి 223 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఎక్కువ సీట్లలోనే మహాయుతి కూటమి హవా వీస్తోంది. మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 57 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈవిధంగా ఏకపక్షంగా వస్తున్న ఫలితాలపై శివసేన (ఉద్ధవ్ థాక్రే) పార్టీ నేత సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తంచేశారు. ఇది ప్రజా తీర్పు(Maharashtra Elections 2024) కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏవైనా అవకతవకలు జరిగి ఉండొచ్చని ఆరోపించారు.
Also Read :AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ముందున్నది ఎవరు అంటే.. ?
‘‘మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి రావాల్సిన సీట్లను కాజేసేందుకు వాళ్లు (మహాయుతి కూటమి) ఏదో గడ్బడ్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే అదే భావన కలుగుతోంది. ఇది ప్రజల తీర్పులా కనిపించడం లేదు. ప్రజలు కూడా ఈ ఫలితాలతో ఏకీభవించరు’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ‘‘ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీకి 60 సీట్లు రావడం సాధ్యమయ్యే విషయమేనా ? అజిత్ పవార్‌కు 40 సీట్లు సాధించే సీన్ ఉందా ? బీజేపీకి 125 సీట్లు గెలిచే దమ్ముందా ?’’ అని ఆయన ప్రశ్నలు సంధించారు. ‘‘నాకు నమ్మకం ఉంది. మహారాష్ట్ర ప్రజలు నిజాయితీపరులు.. వాళ్లు ఇలాంటి తీర్పులు ఇవ్వరు’’ అని సంజయ్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ మండిపడ్డారు. ప్రజలు నమ్మకంతో మళ్లీ మహాయుతి కూటమికే అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజల తీర్పుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సంజయ్‌కు సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారంతో మహారాష్ట్ర పురోగమిస్తోందని, దీన్ని ప్రజలు గుర్తించారని ఆయన చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే మహారాష్ట్ర పురోగతి సాధ్యమని రాష్ట్ర ప్రజలు గుర్తించారని ప్రవీణ్ దరేకర్ తెలిపారు.