ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి మన దేశానికి చెందిన “సియాచిన్” గ్లేషియర్.అక్కడ ఆర్మీలో డ్యూటీ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎముకలు కొరికే చలిని తట్టుకోవాల్సి ఉంటుంది. ఆకస్మికంగా మంచు కొండలు విరిగిపడే ముప్పు ఉంటుందని తెలిసినా.. దేశం కోసం డ్యూటీ కొనసాగించాల్సి ఉంటుంది.
ఇటువంటి సవాళ్ల నడుమ “సియాచిన్” గ్లేషియర్ పై డ్యూటీ చేస్తూ.. “ఆపరేషన్ మేఘ దూత్” లో భాగంగా పాక్ పై పోరాడుతూ ఒక సైనికుడు 38 ఏళ్ల క్రితం గల్లంతు అయ్యాడు. వీర మరణము పొందాడు. గల్లంతు అయిన విషయాన్ని అప్పట్లోనే ఇండియన్ ఆర్మీ.. సైనికుడి కుటుంబానికి తెలియజేసింది. అయితే ఆ సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత “సియాచిన్” గ్లేషియర్ పై డ్యూటీ చేస్తున్న సైనికులకు దొరికింది. ఒక పాత ఆర్మీ బంకర్ ను తెరిచి తనిఖీ చేస్తుండగా ఆ వీర జవాను మృతదేహం లభ్యమైంది. ఆయనను ఉత్తరాఖండ్ లోని కుమా ఉన్ రెజిమెంట్ కు చెందిన చంద్రశేఖర్ హర్ భోళాగా గుర్తించారు. మరో సైనికుడి మృతదేహం కూడా అక్కడే లభ్యమైంది. అయితే ఆయన ఎవరు అనేది ఇంకా నిర్ధారించలేకపోయారు.
38 ఏళ్ల క్రితం ఎందుకు వెళ్లారు ?
సియాచిన్ గ్లేషియర్ లో పాకిస్తాన్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ 1984 సంవత్సరంలో “ఆపరేషన్ మేఘ దూత్” నిర్వహించింది. ఇందులో భాగంగా అప్పట్లో 20 మంది ఆర్మీ జవాన్లను సియాచిన్ గ్లేషియర్ పై దింపింది. ఆ 20 మంది
జవాన్లలో చంద్రశేఖర్ హర్ భోళా ఒకరు. సియాచిన్ గ్లేషియర్ పై పెట్రోలింగ్ చేస్తుండగా ..మంచు కొండలు విరిగిపడి 20 మంది జవాన్లు కూడా చనిపోయారు. వారిలో 15 మంది మృతదేహాలు అప్పట్లోనే లభ్యమయ్యాయి. మిగితా ఐదుగురి డెడ్ బాడీస్ అప్పట్లో దొరకలేదు. ఆ ఐదుగురు మిస్ అయిన జవాన్లలో చంద్రశేఖర్ హర్ భోళా ఒకరు. ఎట్టకేలకు ఆయన మృతదేహం లభించడంతో ఉత్తరాఖండ్ లోని స్వగృహానికి తరలించారు. 38 ఏళ్ల క్రితమే చనిపోయిన చంద్రశేఖర్ హర్ భోళా మృతదేహాన్ని చూసి .. ఆయన భార్యా పిల్లలు ఎంతటి ఉద్వేగానికి గురై ఉంటారో మాటల్లో వర్ణించి చెప్పలేం.చంద్రశేఖర్ హర్ భోళా చనిపోయే సమయానికి 38 ఏళ్ల క్రితం.. ఆయన భార్య శాంతి దేవి వయసు 28 ఏళ్ళు, పెద్ద కూతురు వయసు 4 ఏళ్ళు, చిన్న కూతురు వయసు ఏడాదిన్నర. ఇప్పుడు చంద్రశేఖర్ హర్ భోళా కూతుళ్లు ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేశాడని చెప్పేందుకు గర్వంగా ఉందని చంద్రశేఖర్ హర్ భోళా భార్య శాంతి దేవి తెలిపారు.