A320 Software Upgrade : సోలార్ రేడియేషన్‌ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!

సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్‌బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్‌‌లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపాయి. దీంతో ప్రయాణికులు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌బస్ 320 విమానాల్లో […]

Published By: HashtagU Telugu Desk
A320 Software Upgrade

A320 Software Upgrade

సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్‌బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్‌‌లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపాయి. దీంతో ప్రయాణికులు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది.

ఎయిర్‌బస్ 320 విమానాల్లో సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా వేలాది సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌బస్‌ హెచ్చరికల గురించి ఐరోపా సమాఖ్య ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. సోలార్‌ రేడియేషన్‌ కారణంగా ఎ 320 విమానాల్లోని ఎలివేటర్ ఐలెరాన్ కంప్యూటర్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్‌బస్‌ పేర్కొంది. ఈ రేడియేషన్ ప్రభావంతో విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్టు తెలిపింది. దీంతో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్టు వివరించింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎయిర్‌బస్ 320 విమానాలు 6 వేలు ఉండగా.. వాటన్నింటికి అప్‌గ్రెడేషన్‌ అవసరమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎ320 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇప్పటికే ఎయిర్‌ఫ్రాన్స్‌ 35 విమాన సర్వీసులను రద్దు చేయగా.. మరికొన్ని విమానాలపై దీని ఎఫెక్ట్ ఉండొచ్చని తెలిపింది. కొలంబియాకు చెందిన ఏవియాంకా ఎయిర్‌లైన్స్ సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా తమ విమాన సర్వీసుల్లో 70 శాతం ప్రభావితమైనట్టు ప్రకటించింది. కాగా, భారత్‌కు చెందిన ఇండిగో , ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్ వద్ద ఎ320 విమానాలు 560 వరకు ఉన్నాయి. సాంకేతిక సమస్య కారణంగా వీటిలో 200-250 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయా విమాన సర్వీసులపై ప్రభావం పడనుంది.

ఎయిర్‌బస్‌ ప్రకటనతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో తమ విమాన సర్వీసుల షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయని పేర్కొంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌‌లు సైతం ఇలాంటి ప్రకటనలే చేశాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టామని. పలు రూట్లలో సర్వీసులకు అంతరాయం కలగొచ్చని తెలిపాయి. ‘‘అన్ని విమానాల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ జరిగే వరకు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని ఎయిరిండియా తెలిపింది. అయితే, అయితే, ఎన్ని సర్వీసులపై ప్రభావం పడుతుందనేది అవి స్పష్టం చేయలేదు.

A320 ఫ్యామిలీలో A319లు, A320 ceo, neo, A321 ceo, neo మోడళ్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఒక ఘటనపై జరిగిన విశ్లేషణలో సోలార్ రేడియేషన్ విమాన నియంత్రణ వ్యవస్థలకు అత్యంత కీలకమైన డేటాను దెబ్బతీయగలదని ఎయిర్‌బస్ గుర్తించింది. ‘‘ఈ సమయంలో ఆటోపైలట్ పనిచేస్తూనే ఉంది. స్వల్పంగా, కొద్ది సేపు మాత్రమే ఎత్తు తగ్గింది. మిగతా ప్రయాణం ఎటువంటి సమస్యలు లేకుండా సాగింది.. ఎయిర్‌బస్ నిర్వహించిన ప్రాథమిక సాంకేతిక పరిశీలనలో ప్రభావితమైన ELAC లో వచ్చిన లోపం ఈ ఘటనకు కారణమైన అంశాల్లో ఒకటిగా గుర్తించాం’’ అని పేర్కొంది.

  Last Updated: 29 Nov 2025, 11:21 AM IST