Site icon HashtagU Telugu

Hidma : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల తుదెత్తు.. హిడ్మా, దేవా ముప్పు ముగుస్తుందా..?

Maoist

Maoist

Hidma : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. 2026 మార్చి 31నాటికి మావోయిస్టు నెట్‌వర్క్‌ను పూర్తిగా కూల్చివేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యల నడుమ, అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతలు హిడ్మా, బార్సే దేవా ఇద్దరూ భద్రతా బలగాల నిశిత కనుసన్నల్లో ఉన్నారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకారం, వీరు సరిగ్గా ఎక్కడున్నారన్న సమాచారాన్ని నిరంతరం అప్డేట్ చేస్తూ, సరెండర్ చేయాలని లేకపోతే ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల, నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్, ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతాలు, నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో తలదాచుకుంటున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లతో ఇప్పటికే పలువురు మావోయిస్టు నాయకులు హతమయ్యారు. మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో ఆపరేషన్‌లకు ఊపొచ్చింది.

ఇప్పుడు భద్రతా బలగాలు అత్యాధునిక టెక్నాలజీతో—డ్రోన్లు, శాటిలైట్‌లు, రిమోట్ సెన్సింగ్ పరికరాలతో మావోయిస్టుల కదలికలను ట్రాక్ చేస్తున్నాయి. గతంలో అడవుల్లో కనిపించకుండా గుట్టుచప్పుడు కాకుండా కదలాడే మావోలు, ఇప్పుడు సాంకేతిక నిఘాకు చిక్కి వరుసగా హతమవుతున్నారు. ముఖ్యంగా PLGA కీలక నేతలు టార్గెట్‌గా మారారు.

సరెండర్ అయిన మావోయిస్టుల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు అపరేషన్లను మరింత వేగవంతం చేశాయి. ప్రస్తుతం PLGA నంబర్ వన్ కమాండర్ మడివి హిడ్మా, నంబర్ 2 కమాండర్ బార్సే దేవా ఇద్దరూ ఇంద్రావతి నది పరిసరాల నేషనల్ పార్క్ ప్రాంతాల్లో సంచరిస్తున్నారని సమాచారం. వీరిద్దరినీ లొంగిపోవాలని లేకపోతే ఎదురుకాల్పుల ద్వారా మట్టుపెట్టడం తప్పదని ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు.

ఇప్పటికే మావోయిస్టు బెటాలియన్ సైజు 300పైగా ఉండగా, ఇప్పుడు భారీ సంఖ్యలో హతమవడం, అరెస్టులు, లొంగుబాట్లతో గణనీయంగా తగ్గిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వేల మంది భద్రతా బలగాలు అడుగడుగునా గాలింపు చేపడుతున్నాయి. ఇంతవరకు ఐజీ స్థాయి అధికారి ఇలా స్పష్టంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. ఈసారి హిడ్మా, దేవాల అంతం అనివార్యమని అధికారుల ధీమా.

Srisailam Dam : శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోంది-కేంద్రానికి తెలంగాణ లేఖ