ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయ వైద్య విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేకంగా విమానాలు నడుపుతూ వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. రాజధాని కీవ్ నుంచి అందర్నీ తరలించింది. ప్రస్తుతం అక్కడ వైద్య విద్యార్థులు సహా భారతీయులు ఎవరూ లేరు. దాంతో రాయబార కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లారు.
అందరూ బోర్డర్లకు వస్తే, అక్కడ నుంచి సరిహద్దుల్లోని దేశాలకు తీసుకువెళ్లి, అక్కడ నుంచి విమానాల ద్వారా భారత్ కు పంపిస్తామని అధికారులు విద్యార్థులకు మెసేజ్‌లు పంపించారు.అక్కడ ఇంకా 16వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారి కోసం రానున్న మూడు రోజుల్లో 26 విమానాలు నడిపే అవకాశం ఉంది. సరిహద్ధులకు చేరుకోవడం మెడికోలకు కష్టంగా మారింది. రైళ్లను ఎక్కనీయడం లేదని, ఎక్కకుండా కొడుతున్నారని కూడా సమాచారం.
రైల్వే స్టేషన్లు, బంకర్లు, బోర్డర్ పోస్టుల్లో భయం భయంగా కాలం గడుపున్నారు. సామాన్య ప్రజలు నివసించే ప్రాంతలపైనా రష్యా బాంబులు వేస్తుండడంతో బయటకు వచ్చే పరిస్థితులు ఏమాత్రం లేవు. దాంతో ఆహారం, మంచినీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కష్ట కాలంలో ఒకరికొకరు అండగా ఉంటూ ధైర్యం చెప్పుకొంటున్నారు. అలాంటి ప్రయత్నంలోనే కర్ణాటక విద్యార్థి నవీన్ కన్నుమూశాడు.
జూనియర్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ముందుగా కాకుండా చివరగా వెళ్లాలని అనుకున్నాడు. ఆరు రోజుల పాటు బంకర్‌లో ఉండి, ఆహారం కోసం బయటకు వచ్చి బాంబు దాడిలో ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. రాయబారులతో మాట్లాడింది. అందుకే ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను త్వరగా తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.