భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 12:56 PM IST

 

Encounter: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన క్రమంలో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా చత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లా(Bijapur District)లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

మావోయిస్టుల కదిలికలు ఉన్నాయన్న సమచారంతో చికుర్‌బత్తి-పుస్బాక అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌ బలగాలు సంయుక్తంగా యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భద్రతా సిబ్బంది కూంబింగ్ చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దాంతో వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంటనే తిరిగి వీళ్లు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. కాగా.. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ చెప్పారు. ఇక అటవీ ప్రాంతంలో ఇంకా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read Also: Jagan and Sharmila: షర్మిల మీద జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదా..!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యాంటీ నక్సల్‌ ఆపరేషన్ చేస్తున్నాయి భద్రతా బలగాలు.