Site icon HashtagU Telugu

Eknath Shinde: గురువారం ముంబై రానున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా?

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. శివసేన రెబల్ నేత.. ఏక్ నాథ్ షిండే మొత్తానికి గౌహతిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ నుంచి బయటకు రానున్నారు. ఆయనతోపాటు శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలంతా ఆ హోటల్ లోనే ఉన్నారు. జూన్ 22 నుంచి వారు అక్కడే విడిది చేశారు. ఆయన అక్కడి కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆ దేవత అనుగ్రహం కోసం పూజలు చేశారు. తమను దీవించమని అమ్మవారిని వేడుకున్నారు. బ్రహ్మపుత్రా నదీ ఒడ్డున నీలాచల్ కొండపై కొలువుదీరిన అమ్మవారిని ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దర్శించుకున్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు షిండే.

ముంబయిలో గురువారం నుంచి అసలు రాజకీయం నడవనుంది. ఎందుకంటే ఏక్ నాథ్ షిండే… గురువారం నాడు ముంబై వస్తారు. తాను నడిపిస్తున్న కథలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న ఆయన.. ఇప్పుడు అసలు సిసలు ట్విస్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయనకు మద్దతివ్వడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అసోంలోని బీజేపీ ఎమ్మెల్యే అయిన సుశాంత… షిండే గ్రూప్ విమానం దిగిన దగ్గరి నుంచి వారితోనే ఉన్నారు. ఆయనే రెబల్ ఎమ్మెల్యేలకు కావలసినవన్నీ చూసుకుంటున్నారు. ముంబై నుంచి 2700 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతిలో ఉంటున్న షిండే గ్రూప్ ను ఎవరూ టచ్ చేయకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. వారికి ఆర్థికంగా, అన్ని రకాలుగా బీజేపీయే సపోర్ట్ ఇస్తోందన్న టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్టే.. బీజేపీ ఎమ్మెల్యే సుశాంత వారితోనే ఉండడం ఆ వాదనకు మరింత బలం చేకూర్చింది. ఇప్పుడు షిండే ముంబై వచ్చిన తరువాత అక్కడి రాజకీయం ఇంకెలా మారుతుందో చూడాలి.