Site icon HashtagU Telugu

Himachal Pradesh Elections: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎన్నికల నగరా మోగింది.. షెడ్యూల్ ఇదిగో!

election campaign

election campaign

మళ్లీ నార్త్ ఇండియాలో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఇండియా సెమీ ఫైనల్స్ గా భావించిన యూపీ ఎన్నికల పోరు తర్వాత హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌నర్ రాజీవ్ కుమార్‌… ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అనూప్ చంద్ర పాండేతో క‌లిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్రకారం ఒకే విడ‌త‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండ‌గా… వాటికి న‌వంబ‌ర్ 12న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపును డిసెంబ‌ర్ 8న చేప‌ట్టి అదే రోజు ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తారు. ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 17న నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుండ‌గా…అదే రోజు నుంచి నామినేష‌న్ల దాఖ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఈ నెల 25తో నామినేష‌న్ల‌కు గ‌డువు ముగియ‌నుండ‌గా… 29 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంది. ఈ ఎన్నికను ద్రుష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అస్త్రాలతో రంగంలోకి దిగబోతున్నాయి.  దేశంలో వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నిక చాలా కీలకంగా మారనుంది.