Site icon HashtagU Telugu

Shrushti Test Tube Baby Centre : నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు.. తెరపైకి సంచలన విషయాలు

Surrogacy Scam

Surrogacy Scam

Shrushti Test Tube Baby Centre : సృష్టి క్లినిక్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసి పేరుతో జరిగిన భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. సరోగసి పేరుతో అమాయక దంపతుల నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి, వేరే మహిళకు పుట్టిన బిడ్డను అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

గోపాలపురానికి చెందిన ఓ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గురించి ఆన్‌లైన్‌లో తెలుసుకుని డాక్టర్ నమ్రతను సంప్రదించారు. సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనేందుకు రూ.30 లక్షలు అవుతుందని నమ్రత వారికి చెప్పింది. విజయవాడ వెళ్లి నమూనాలు ఇచ్చిన తర్వాత, సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని నమ్రత వారికి తెలియజేసింది. కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని, సిజేరియన్ డెలివరీ కావడంతో అదనంగా రూ.10 లక్షలు ఖర్చయిందని చెప్పి ఆ డబ్బును కూడా వసూలు చేసింది.

అయితే, కొన్ని నెలల తర్వాత ఆ బాబు పోలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో దంపతులు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోరారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించింది. దీంతో దంపతులు ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా, అది మరొకరి డీఎన్‌ఏ అని తేలింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

సరోగసి జరగలేదు, బదులుగా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి, ఇక్కడ డెలివరీ చేశారని, ఆమెకు పుట్టిన బిడ్డను రూ.90 వేలకు కొనుగోలు చేసి, పిల్లలు కావాలనుకున్న దంపతులకు రూ.40 లక్షలకు విక్రయించారన్నారు.

డాక్టర్ నమ్రత దంపతులపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఆమె కొడుకు జయంత్ అడ్వకేట్‌గా ఉన్నాడని, బాధితులు వస్తే కోర్టులు, కేసుల పేరుతో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. డాక్టర్ నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఐవీఎఫ్ వైఫల్యాలు, సరోగసిలో అక్రమాలు వంటి కేసులు ఆమెపై నమోదయ్యాయి.

Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్!