Shraddha Murder: కారాగారంలో నాకు రక్షణ కరువైంది.. బెయిల్‌ కోసం అఫ్తాబ్‌ ఏం చేశాడంటే..!

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 08:13 PM IST

Shraddha Murder:  అత్యంత పాశవికంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ శ్రద్ధ వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్‌ పూనా వాలాను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. శ్రద్ధను అత్యంత దారునంగా ముక్కలు ముక్కలుగా చేసిన అఫ్తాబ్‌ను గత నెలలోనే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్తాబ్‌ను కోర్టులో హాజరుపరచగా అనంతరం న్యాయమూర్తి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

రక్షణ కరువైంది.. బెయిల్‌ ఇవ్వాలంటూ..
ప్రస్తుతం అఫ్తాబ్‌ బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించాడు. తనకు జైల్లో భద్రత కరువైందని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్‌ వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రియురాలిని ఆట బొమ్మగా చూసి ముక్కలుగా నరికిన కిరాతక వ్యక్తి తనకు జైల్లో భద్రత కరువైందని పిటిషన్‌ వేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు అఫ్తాబ్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే అఫ్తాబ్‌కు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను డిసెంబర్‌ 23వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం అఫ్తాబ్‌ తీహార్‌ జైల్లో ఉన్నాడు. సహజీవనం చేస్తున్న కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధావాకర్‌ను చంపి ఆమె శరీరాన్ని ఘోరంగా ముక్కలు చేశాడు అఫ్తాబ్‌. తర్వాత అడవిలో ముక్కలను రోజుకొకటి చొప్పున పడేస్తూ వచ్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్కోటెస్ట్‌, పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు.

అఫ్తాబ్‌ చెప్పిన వివరాల ఆధారంగా మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శ్రద్ధ శరీరం అవశేషాలను పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు చేసిన అనంతరం అవి శ్రద్ధ అవయవాలేనని తేల్చారు. తర్వాత నిందితుడి ఇంట్లో రక్తం నమూనాలను కూడా పరిశీలించి నిర్ధారణకు వచ్చారు. అయితే, శ్రద్ధ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయకపోవడం గమనార్హం. నిందితుడు జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉన్నాడు. కిరాతకంగా ఓ యువతిని హతమార్చిన అఫ్తాబ్‌ను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.