Arvind Kejriwal: దేశ రాజకీయం మరోసారి వేడెక్కింది. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపడం సరైంది కాదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెరిగారు. అమిత్ షా ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, 30 రోజులకు మించి జైలులో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి, మంత్రి, ప్రధాని పదవులలో కొనసాగకూడదనే నిబంధనలపై చర్చ జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో జైలు నుంచే పాలన సాగించడమా? ఇది సమాజానికి సరైన సంకేతమా? అని ప్రశ్నించడంతో, ఆ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
తీవ్ర నేరారోపణలున్నవారిని మంత్రులుగా చేయడమా నైతికత?..కేజ్రీవాల్
వాస్తవానికి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పార్టీలోకి చేర్చుకోవడం, వారిపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవడం, ఆ తరువాత మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా నియమించడం జరుగుతోంది. అలాంటి వారిని ప్రశ్నించే ధైర్యం మీకుందా? వారు తమ పదవులకు రాజీనామా చేయాలి కదా? అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఇంతకంటే ముందుకెళ్లి, తప్పుడు కేసులపై కూడా ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా నాయకుడిపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి, ఆయన జైలుకెళ్తే, తరువాత ఆయన నిర్దోషిగా తేలితే ఆ నాయకుడిని జైలుకు పంపిన మంత్రి లేదా అధికారి ఎలాంటి శిక్షకు గురవ్వాలి? అంటూ మరో సంచలన ప్రశ్న సంధించారు.
160 రోజులు జైల్లో ఉన్నా, ఢిల్లీ ప్రజల కోసం పాలన కొనసాగించాను
కేంద్ర ప్రభుత్వం తనపై రాజకీయ కుట్ర పన్నిందని, తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపిందని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. నేను 160 రోజుల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపాను. కానీ ఒక్కరోజు కూడా ఢిల్లీ ప్రజలకు సేవల లోపం తలెత్తనివ్వలేదు. మా ప్రభుత్వ పనితీరును చూసి ప్రజలే నిర్ణయించాలి అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ విభేదాలు మళ్లీ ఉద్ధృతం
ఈ వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వంతో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉన్న రాజకీయ దూరాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అధికార పార్టీ వర్సెస్ విపక్షాల మధ్య ఉన్న అవిశ్వాస వాతావరణం మరింత తీవ్రతరంగా మారింది. ఒకవైపు నేతలపై ఉన్న కేసులు, మరోవైపు అధికార దుర్వినియోగ ఆరోపణలు ఇవన్నీ రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాలే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ఈ సంఘటనలు ప్రభావం చూపే అవకాశముంది. నైతిక విలువలతో కూడిన నాయకత్వం గురించి మరోసారి చర్చ మొదలైంది. కేజ్రీవాల్ సంధించిన ప్రశ్నలకు అమిత్ షా లేదా కేంద్ర బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.