Site icon HashtagU Telugu

Midnight Runner Pradeep Mehra: మిడ్‌నైట్ ర‌న్న‌ర్‌కు.. ఊహించ‌ని సాయం..!

Midnight Runner Pradeep Mehra

Midnight Runner Pradeep Mehra

భార‌త సైన్యంలో చేరాల‌నే ల‌క్ష్యంతో అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు తీస్తూ ప్ర‌దీప్ మెహ్రా రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్షేష‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌దీప్ మెహ్రా రన్నింగ్ వీడియోను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు వినోద్ కాప్రి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో ఆ వీడియో ఒక్క‌సారిగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ వైర‌ల్ కుర్రాడిని ఇంటర్వ్యూలు చేసేందుకే బ‌డా మీడియా సంస్థ‌లు వెంట‌ప‌డ్డాయి. అయితే ఓ ల‌క్ష్యం వైపు వెళుతున్న తన ప్రయాణాకి ఆటంకం కలిగించొద్దంటూ, ఈ ఉత్త‌రాఖండ్ కుర్రాడు సున్నితంగా మీడియాను వేడుకున్నాడు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ప్ర‌దీప్ మెహ్రా త‌ల్లి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రదీప్ తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పనిచేస్తూ చదవాల్సి వస్తుందని, ప్ర‌స్తుతం తన సోదరుడితో కలిసి ఉంటున్నట్టు చెప్పాడు. అంతే కాకుండా ఆనారోగ్యంతో తన తల్లి రెండు నెలలుగా ఆసుపత్రిలో ఉందని వెల్లడించాడు. దీంతో ల‌క్ష్యం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న ప్ర‌దీప్ మెహ్రాకు హెల్స్ చేసేందుకు ప‌లువురు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల నొయిడా జిల్లా క‌లెక్ట‌ర్ సైతం ప్ర‌దీప్‌కు సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఆనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్న ప్ర‌దీప్ త‌ల్లి వైద్యానికి రిటైల్ బ్రాండ్ షాప‌ర్స్ స్టాప్ 2.5 లక్షల రూపాయల చెక్కును అందించింది. దీంతో షాప‌ర్స్ స్టాప్ సాయం పై స్పందించిన ప్ర‌దీప్ మెహ్రా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఇక మ‌రోవైపు డైరెక్ట‌ర్ వినోద్ కప్రి సైతం, ప్ర‌దీప్ మెహ్రాకు సాయం అందించిన షాపర్స్ స్టాప్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ప్రదీప్ మెహ్రాకు అందరి ప్రేమ, మద్దతు దొరికినందుకు సంతోషంగా ఉంద‌ని. ఈ క్ర‌మంలో ప్రదీప్ తల్లి చికిత్స కోసం, అతడి కలలను ముందుకు కొనసాగించేందుకు 2.5 లక్షల చెక్కును ఇచ్చిన షాప‌ర్స్ స్టాప్ సంస్థ‌ను దేవుడు ఆశీర్వదిస్తాద‌ని వినోద్ కప్రి ట్వీట్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డైరెక్ట‌ర్ వినోద్ కాప్రీ చేసిన ఒకే ఒక్క ట్వీట్, ప్ర‌దీప్ జీవితంలో ఎంతో మార్పు తెచ్చింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.