ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా, ఆయనను అగౌరవపరిచేలా మాట్లాడటం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంగీకరించదగిన పని కాదని, అందుకే సీవీ షణ్ముగం ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
తాజాగా, కొత్త కార్మిక చట్టం ప్రకారం 12 గంటల పని సమయం, వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం, గంజాయి రవాణా, మద్యం విక్రయాలు మొదలైన అంశాలపై అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో, సీవీ షణ్ముగం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా, ఆయనపై అవహేళనపూర్వక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ముఖ్యమంత్రిని ఇలాంటి విధంగా విమర్శించడం అనైతికమని, అందుకే సీవీ షణ్ముగంకు ఈ విషయంలో విచారణ తప్పదని పేర్కొంది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు:
డీఎంకే నేతలు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయడంతో, జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ నేపథ్యంలో, సీవీ షణ్ముగం ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానికి సంబంధించిన విచారణ ప్రస్తుతం అపెక్స్ కోర్టులో కొనసాగుతోంది.
ఈ కేసులో, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, తన ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు 23 సెప్టెంబరు న సీవీ షణ్ముగంకు ఆదేశించింది. అదేవిధంగా, జిల్లా కోర్టు విచారణపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
ఈ అంశం మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు సుదన్షు తులియా, అజానుద్దీన్ అమనుల్లాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సబబు?” అని ప్రశ్నించారు. “అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా?” అని కూడా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీవీ షణ్ముగం ఈ కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేని, ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.