Site icon HashtagU Telugu

Shiv Sena Allegations: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లా? శివసేన సామ్నా ఎడిటోరియల్ లో ఆరోపణలు!

Shiv Sena Shinde

Shiv Sena Shinde

మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా తలా రూ.50 కోట్లకు అమ్ముడుబోయారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చిన అక్షరాలు తూటాల్లా పేలాయి. లేకపోతే.. శివసేనలో చీలిక తెచ్చిన అసమ్మతి ఎమ్మెల్యేలకు వై ప్లస్ భద్రత కల్పించడమేంటని ప్రశ్నించింది. అంటే ఇదంతా బీజేపీ మద్దతుతోనే నడుస్తోందంటూ ఆరోపించింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వైప్లస్ భద్రతను ఆదివారం నాడే కల్పించింది కేంద్రం. వారి కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీని ఇచ్చింది. ఇది శివసేనకు ఆగ్రహం తెప్పించింది. బీజేపీకి ఈ ఎపిసోడ్ తో సంబంధం లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుందని ప్రశ్నించింది.

శివసేనలో తిరుగుబాటు అంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పే బీజేపీ.. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు వారి నాయకుడు ఏక్ నాథ్ షిండేతో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. వడోదరలో ఎలా భేటీ అయ్యారని, ఆ మీటింగ్ లో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారంటూ ఆరోపించింది. బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అసమ్మతి ఎమ్మెల్యేలు నడుచుకుంటున్నారని విమర్శించింది.

రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కేలా శివసేన కన్నాడ్ ఎమ్మెల్యే ఉదయం సింగ్ రాజ్ పుత్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు.. తనను కూడా వారితో కలవాలి అన్నారని.. పదే పదే ఫోన్లు చేశారని, ఒత్తిడి చేశారని అన్నారు. వాళ్లు ఓ కారులో రూ.50 కోట్లు తీసుకువచ్చామని తనతో చెప్పారన్నారు. కానీ వారితో కలవడం తనకు ఇష్టం లేదన్నారు. శివసేన పార్టీకి, థాకరే కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నారు. మొత్తానికి శివసేన పొలిటికల్ ఎపిసోడ్ మాత్రం క్షణక్షణానికి ట్విస్టులతో సాగుతోంది.

Exit mobile version