Maharashtra Politics : శివ‌సేన‌కు షాక్‌, షిండే కొత్త పార్టీ

మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. ప‌రిస్థితిని అనుకూలంగా మార్చుకోవాల‌ని ఏ పార్టీకి ఆ పార్టీ పావులు క‌దుపుతున్నాయి

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 05:00 PM IST

మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. ప‌రిస్థితిని అనుకూలంగా మార్చుకోవాల‌ని ఏ పార్టీకి ఆ పార్టీ పావులు క‌దుపుతున్నాయి. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తుంటే, హ‌ఠాత్తుగా శివ‌సేన రెబ‌ల్ షిండే కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. శివ‌సేన‌కు షాక్ ఇచ్చేలా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో శివ‌సేన రెబ‌ల్ గా మారిన మంత్రి ఏక్ నాథ్ షిండే `శివ‌సేన బాలాసాహెబ్` పార్టీని ప్ర‌క‌టించారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో మూడింట రెండొంత‌ల మంది ఉంటే కొత్త పార్టీగా గుర్తించే అవ‌కాశం ఉంది. చ‌ట్టం ప్ర‌కారం మూడింట్ రెండొంతుల మంది ఏ పార్టీ నుంచైనా మారడానికి వెసుల‌బాటు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి ప‌రిస్థితిని చూశాం. అంతేకాదు, రాజ్య‌స‌భ వేదిక‌గా తెలుగుదేశం పార్టీని బీజేపీ విలీనం చేసుకుంది. అదే త‌ర‌హాలో ఇప్పుడు మ‌హారాష్ట్ర అసెంబ్లీ వేదిక‌గా మ‌రో పార్టీ ఆవిర్భావం అయింది.

శివసేన పార్టీని పూర్తిగా చంపేసేందుకు బీజేపీ కుట్ర ప‌న్నింద‌ని సేన లీడ‌ర్లు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా ఏదైతే, వాళ్లు అనుమానించారో, అదే త‌ర‌హాలో షిండే రూపంలో శివ‌సేన‌కు ప్ర‌మాదం ఏర్ప‌డింది. షిండే ప్ర‌క‌టించిన పార్టీకి బీజేపీ మ‌ద్ధ‌తు ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. అదే, జ‌రిగితే శివ‌సేనకు అసెంబ్లీలో గుర్తింపు పోతుంది. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీని ఉమ్మ‌డి ఏపీలో అసెంబ్లీ వేదిక‌గా ఎన్టీఆర్ నుంచి అధికారికంగా తొల‌గించారు. ఇంచుమించు అదే పంథాలో షిండే శివ‌సేన పార్టీకి గుర్తింపు లేకుండా చేసి కొత్త పార్టీకి గుర్తింపు తెచ్చేలా షిండే పావులు క‌దుపుతున్నారు. అదంతా శివ‌సేన‌లోని రాజ‌కీయ ఎపిసోడ్ అంటూ సంకీర్ణంలోని పార్టీలు మౌనంగా ఉన్నాయి.

శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీని ప్రకటించారు. తమ గ్రూపుకు ‘శివసేన బాలాసాహెబ్’ అనే పేరు పెట్టినట్టు రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ వెల్ల‌డిండంతో స‌రికొత్త రాజ‌కీయానికి మ‌హారాష్ట్ర వేదిక అయింది. ఇప్పటి నుంచి తమ గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుతో పిలవబడుతుందని ఆయన తెలిపారు. ఏ పార్టీలో కూడా తాము కలవబోమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో, రెబెల్ ఎమ్మెల్యేలు ఇక శివసేన గూటికి చేరే అవకాశాలు లేవని స్ప‌ష్టం అవుతోంది.