Site icon HashtagU Telugu

Congress President: అధ్యక్ష రేసులో గెహ్లాట్, శశిథరూర్?

Shashi Tharoor Gehlot Imresizer

Shashi Tharoor Gehlot Imresizer

గాంధీ కుటుంబం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను అధ్యక్షునిగా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే, ఆయన అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అందుకు ముఖ్య కారణం తను సూచించిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేయాలని ఆయన షరతు పెట్టినట్లు సమాచారం. అందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదని తెలిసింది. అయితే, ఆయన కూడా పోటీకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ విధంగా అధ్యక్షపదవికి శశిథరూర్, అశోక్ గెహ్లాట్‌‌ల మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది. రాహుల్ గాంధీకి తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు విఫలం కావడంతో అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఏకాభిప్రాయ అభ్యర్థి లభించకపోతే వచ్చే నెల 17న ఈ పదవికి ఎన్నికలు జరుగుతాయి.కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, జయరాం రమేష్ వంటివారు ఏకాభిప్రాయ అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రాహుల్ పోటీ చేయరన్న స్పష్టత లేదు

కాగా, అధ్యక్ష పదవికి తాను పోటీ చేసేదీ చేయనిదీ రాహుల్ గాంధీ ఇంతవరకూ స్పష్టంగా చెప్పలేదు. కాంగ్రెస్ నాయకత్వంపై గందరగోళంలేదని, అధ్యక్ష పదవిపై స్పష్టత ఉందని భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి జిల్లా పులియూర్‌‌లో రాహుల్ విలేకరులకు చెప్పారు. తాను ఏమి చేయాలో తన మనసులో స్పష్టంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతాయని, తాను అధ్యక్షిడిని అవుతానా లేదా అన్నది ఎన్నికలు జరిగినప్పుడు తెలుస్తుందని చెప్పారు. అందువల్ల రాహుల్ పోటీ చేయరు అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ తోడు ఇంకా చాలా మంది పార్టీకి చెందిన ప్రముఖులు రాహుల్ గాంధీయే అధ్యక్షుడవ్వాలని కోరుకుంటున్నారు.

రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ ఏడు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీని అధ్యక్షునిగా నియమించాలని తీర్మానాలు చేశాయి. జైపూర్‌లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాటే రాహుల్ అధ్యక్షుడు కావాలని ప్రతిపాదించారు. మరికొన్ని రాష్ట్రాల కమిటీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఇలాంటి తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో చివరి నిమిషంలో రాహుల్ మనసు మార్చుకుని పోటీకి దిగే అవకాశం కూడా లేకపోలేదు. అధ్యక్షపదవి ఏకగ్రీవం కాకపోతే అక్టోబరు 17న ఎన్నికలు జరుగుతాయి. రెండు రోజుల తర్వాత 19వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవాలని సోనియా ఇప్పటికే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్‌ఛార్జి మధుసూదన్ మిస్త్రీకి చెప్పినట్లు సమాచారం.

Exit mobile version