Congress President: కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే! శ‌శిథ‌రూర్ `రిగ్గింగ్` ఆరోప‌ణ‌లు!!

ఏమీలేని చోట నిప్పును పుట్టించ‌డం ప్రస్తుత రాజ‌కీయాల‌కు కొత్తేమీకాదని నానుడి. కాంగ్రెస్ పార్టీకి ఆ నానుడిని అన్వ‌యిస్తే స‌రిపోతోంది.

  • Written By:
  • Updated On - October 19, 2022 / 02:20 PM IST

ఏమీలేని చోట నిప్పును పుట్టించ‌డం ప్రస్తుత రాజ‌కీయాల‌కు కొత్తేమీకాదని నానుడి. ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీకి ఆ నానుడిని అన్వ‌యిస్తే స‌రిగ్గా స‌రిపోతోంది. ఏఐసీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింద‌ని ఆ ప‌ద‌విని ఆశిస్తోన్న కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ శశిథ‌రూర్ ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్నారు. లెక్కింపు స‌మ‌యంలో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీని ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం

ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 9500 కాగా, ఏఐసీసీ కార్యాలయంలో ఏడు నుంచి ఎనిమిది టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతోంది. ప్రతీ టేబుల్ ముందు ఇద్దరు ఏజెంట్లు కూర్చుని ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికైన కొత్త అధ్యక్షుడి పేరును ప్ర‌క‌టిస్తారు. గాంధీ కుటుంబం మ‌ద్ధ‌తుగా నిలిచిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అధ్య‌క్షుడిగా ఎన్నిక కావ‌డం లాంఛ‌న‌మే. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ పోటీలో ఉన్న శ‌శిథ‌రూర్ మాత్రం రిగ్గింగ్ ఆరోప‌ణ‌లు చేస్తూ న్యూస్ మేక‌ర్ గా నిలిచారు.

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అందుకు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆనాటి నుంచి ఆ ప‌ద‌వి ఖాళీగా ఉంటూ వ‌చ్చింది. ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందుగా తాత్కాలిక అధ్య‌క్షురాలిగా సోనియా బ‌ల‌వంతంగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. అధ్యక్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాల‌ని రాహుల్ ను కాంగ్రెస్ సీనియ‌ర్లు కోరిన‌ప్ప‌టికీ ఆయ‌న అంగీక‌రించ‌లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభ‌వం కోసం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ మేర‌కు గాంధీయేత‌రులకు ఏఐసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డానికి సోనియా సిద్ధం అయ్యారు. ఆ మేర‌కు సంస్థాగ‌తంగా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సిద్ధం అయ్యారు.

తొలుత గాంధీ కుటుంబ విధేయుడు, రాజ‌స్థాన్ సీఎం గెహ్లాట్ ను అద్య‌క్ష రేసులో ఉంచాల‌ని ప్ర‌య‌త్నించారు. రాజ‌స్థాన్ సీఎం ప‌గ్గాలు స‌చిన్ పైలెట్ కు. అప్ప‌గించాల‌ని అధిష్టానం భావించింది. కానీ, ఆక‌స్మాత్తుగా ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు పైలెట్ మీద రివ‌ర్స్ అయ్యారు. దీంతో ప్ర‌భుత్వం కూలిపోతుంద‌న్న భ‌యంతో గెహ్లాట్ ను అక్క‌డ కొన‌సాగిస్తూ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను ఏఐసీసీ అధ్య‌క్ష బ‌రిలోకి దింపారు. అప్ప‌టికే శ‌శిథ‌రూర్ అధ్య‌క్ష ఎన్నిక‌ల రేస్ లో ఉన్నారు. ఆయ‌న‌తో పాటు దిగ్విజ‌య్ సింగ్ కూడా నామినేష‌న్ వేయ‌డానికి సిద్ద‌ప‌డిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో విర‌మించుకున్నారు. దీంతో ఖ‌ర్గే వ‌ర్సెస్ శ‌శిథ‌రూర్ మ‌ధ్య అధ్య‌క్ష ఎన్నిక జ‌రిగింది.

గాంధీ కుటుంబం మ‌ద్ధ‌తు ఇచ్చిన ఖ‌ర్గే విజ‌యం లాంఛ‌నంగా మారింది. పోలింగ్ జ‌రిగిన రోజు నుంచి శ‌శిథ‌రూర్ ప‌లు ర‌కాలుగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను త‌ప్పుబడుతూ వ‌చ్చారు. ఆయ‌న జీ 23 లీడ‌ర్ల‌లో ఒక‌రుగా ఉన్నారు. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా కాంగ్రెస్ సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం మంచిద‌ని ప్ర‌శంసిస్తూనే శ‌శిథ‌రూర్ పోలింగ్‌, లెక్కింపు రోజు కూడా ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. తాజాగా యూపీలో రిగ్గింగ్ జ‌రిగింద‌ని ఆయ‌న చేస్తోన్న ఆరోప‌ణ సంచ‌ల‌నంగా మారింది.