Narendra Modi: ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారీ దెబ్బ వేసిన భారత్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ముసుగు తీసే విధంగా మరో కీలక వ్యూహం రచించింది. ఈ వ్యూహంలో ప్రత్యేకత ఏమిటంటే – ఇందులో కేవలం బీజేపీ ఎంపీలే కాదు, విపక్షానికి చెందిన నేతలు కూడా భాగమవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఈ బహుదల విపక్ష ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నేత షశి థరూర్, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా ఉన్నారు.
మిషన్ లో కాంగ్రెస్ నేత షశి థరూర్:
థరూర్‌ను ఎంపిక చేయడం మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో ఒకటి. గతంలో ఐక్యరాజ్య సమితిలో రెండున్నర దశాబ్దాల పాటు పని చేసిన అనుభవం ఉన్న షశి థరూర్, అంతర్జాతీయ రాజకీయాలు, రాజనీతికి దక్కిన మంచి పేరు కలిగిన వ్యక్తి. ఆయన 2006లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవి రేసులో చివరి వరకు పోటీ చేశారు. అమెరికా, రష్యా-ఉక్రెయిన్ సమస్యలపై కూడా ఆయన మోదీ ప్రభుత్వ ధోరణిని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, ఆపరేషన్ సిందూర్ ప్రారంభం నుంచి థరూర్ తన వాఖ్యానాల ద్వారా ప్రపంచానికి భారత్ వైఖరిని బలంగా వివరించారు.
మిషన్ లో అసదుద్దీన్ ఒవైసీ:
ఇక అసదుద్దీన్ ఒవైసీ విషయంలో — సాధారణంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకుడిగా పేరు పొందారు. కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన పూర్తిగా భారత్‌కు మద్దతుగా నిలిచారు. పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీవీ చర్చలలో పాకిస్థానీ ప్రతినిధులతో కూడా గట్టి వాదనలు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ జనతాపార్టీ నాయకుల నుంచే కాదు, మతపరంగా విభిన్నమైన వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు పొందాయి.
ఒవైసీని ఎంపిక చేయడంలో మరో వ్యూహాత్మక అంశం ఉంది – ఆయన ముస్లిం నేతగా ప్రపంచ ముస్లింల మధ్య విశ్వసనీయత కలిగిన వ్యక్తి. ముస్లిం దేశాల ముందె ప్రాతినిధ్యం వహిస్తూ భారత్ వైఖరిని సమర్థించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఆయన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒవైసీ లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు, మేధో మధనంలో ఎంతో పరిజ్ఞానం కలిగిన నేత. ఆయన వాదనలు తార్కికంగా ఉండడం వల్ల ఎదురుతిరగడం చాలా కష్టమే.
ఈ మిషన్ ఒకరకంగా 1994లో జరిగిన చారిత్రాత్మక సంఘటనను గుర్తు చేస్తోంది. అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో అన్ని పార్టీల నేతలు పాక్షిక రాజకీయ భేదాలను పక్కనపెట్టి, అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో జెనీవాలో భారత పరిరక్షణ కోసం ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో కూడా పాకిస్థాన్ ఆశ్చర్యపోయింది.
ఈసారి కూడా భారత్ అదే మార్గాన్ని అనుసరిస్తోంది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, దేశహితం కోసం అన్ని పార్టీల నేతలు ఒకే వేదికపై సమావేశమవుతున్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘పాక్ బే నకాబ్’ మిషన్, ప్రపంచానికి పాకిస్థాన్ అసలైన ఉగ్రవాద ప్రమేయాన్ని ప్రదర్శించడానికి ఇది బహుదల గొంతుతో జరుగుతున్న సమరమే.