Sharad Pawar : మార్చి 2న ‘మహా’ డ్రామా.. షిండే, ఫడ్నవీస్, అజిత్‌లకు శరద్ పవార్ లంచ్

Sharad Pawar :  మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం జరగబోతోంది.

  • Written By:
  • Updated On - March 1, 2024 / 08:31 AM IST

Sharad Pawar :  మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం జరగబోతోంది. మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, గుర్తులను కోల్పోయిన  రాజకీయ కురువృద్ధుడు  శరద్ పవార్ అనూహ్య స్కెచ్ గీశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌లను మార్చి 2వ తేదీన పూణే జిల్లాలోని బారామతిలో ఉన్న తన నివాసంలో జరిగే భోజన కార్యక్రమానికి శరద్ పవార్ ఆహ్వానించారు. ఇప్పుడు ఈ అంశం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇటీవలె ఎన్సీపీ పార్టీ చీలిపోయిన తరుణంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. శరద్ పవార్ వేసిన పాచిక ఎలా పారుతుంది ? నెక్ట్స్ ఏం జరుగుతుంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చాలా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇండియా కూటమికి గుడ్ బై చెప్పాయి.ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్ కూడా ఎన్డీఏ కూటమికి చేరువయ్యే  ప్రయత్నాలు ఆరంభించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌లతో శరద్ పవార్ (Sharad Pawar) భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచిచూడాలి. ఈనెల 2న  బారామతి పట్టణంలోని విద్యా ప్రతిష్ఠాన్ కళాశాల ఆవరణలో జరిగే జాబ్ మేళా ‘నమో మహరోజ్‌గర్ మేళవా’కు వీరు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రస్తుతం బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ బారామతి లోక్‌సభ స్థానం నుంచి అజిత్ పవార్ తన భార్యను.. సుప్రియా సూలేకు ప్రత్యర్థిగా దింపబోతున్నట్లు మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 2న జరగబోయే భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలో ఎన్డీఏ కూటమిని గద్దె దించేందుకు ఏర్పాటైన ఇండియా కూటమిలో శరద్ పవార్ ముఖ్య నేతగా ఉన్నారు.

Also Read : 44 Died : మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ కూటమిలో కూడా శరద్ పవార్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎన్సీపీ(శరద్ పవార్)-కాంగ్రెస్- శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) పార్టీలతో మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పడింది. మొదట శివసేన పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ షిండే.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో షిండే సీఎం కాగా.. షిండేదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం తేల్చింది. ఆ తర్వాత ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల ఎన్నికల సంఘం, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని తీర్పు చెప్పాయి.