Shah Rukh Khan: బేటే పే హాత్ లగానేసే పెహలే బాప్ సే బాత్ కర్..!

నిజం చెప్పాలంటే షారుఖ్ తన కొడుకు గురించి ఈ సినిమా తీసి ఉంటాడు. కానీ షారుఖ్, దేశం మేలు కోరుకునే అనేక తండ్రులకు ప్రతిరూపం.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 05:40 PM IST

By: డా.ప్రసాదమూర్తి

క్యా షారుఖ్.. క్యా కమాల్ కర్ దియా. సినిమా ఎంత కమర్షియల్ గా తీశాడో, మెసేజ్ అంత సాహసంగా ఇచ్చాడు. దటీజ్ షారుఖ్. ఒప్పుకొని తీరాలి. థియేటర్లోకెళ్ళి సినిమాలు చూసే పెద్ద అలవాటు లేదు గాని, పూర్తిగా లేదని చెప్పలేను. కొన్ని సినిమాలు నేను చూడాలని చూస్తాను. కొన్ని సినిమాలు రివ్యూలు చూసి చిరాకు వచ్చి లేదా ఆనందం పుట్టి చూస్తాను. ఈ సినిమా జవాన్ మాత్రం మరొకందుకు చూశాను. నాకు ఇష్టమైన యూట్యూబ్ పొలిటికల్ ఎనలిస్ట్ అభిసార్ శర్మ నిన్న జవాన్ సినిమా మీద కొన్ని రాజకీయ అంశాలు మాట్లాడారు. అంతే సినిమా చూద్దాం అనిపించింది. చూశాను. చూసిన తర్వాత షారుఖ్ ఖాన్ కి సెల్యూట్ చేయాలనిపించింది. భయపడి ఎంత కాలం బతుకుతావు, రక్త మాంసాలతో నిండిన ఈ శరీరంలో ఒక ఆత్మ అంటూ ఉంటుంది కదా, దానికి ఒక చలనం ఉంటుంది కదా, ఆ చలనం వెనుక ఏదో ఒక స్వప్నం ఉంటుంది కదా.

పఠాన్ సినిమా చూసినప్పుడు, అంతకు ముందు ఆ సినిమా మీద చెలరేగిన దుమారం ఎంత చికాకు పుట్టించిందో తెలియదు. కేవలం ఆ సినిమాలో హీరోయిన్ కాషాయం కలర్లో బికినీ వేసుకుందని ఆ రంగు మీద హంగామా చేశారు బే షరమ్ గాళ్ళు . సినిమా చూశాక రంగరంగా అనిపించింది. ఆ సినిమాలో కూడా దేశాల మధ్య ద్వేషాలు, మతాల మధ్య ద్వేషాలుగా ఉండకూడదని, దేశాల మధ్య మనుషుల గుండెల్లో ప్రేమ ఉంటే, సరిహద్దులు కాదు, మతాలు చూడాలని, దేశాల పేర్లు కాదు, మనుషుల మధ్య ప్రేమ చూడాలని, ఉగ్రవాదం స్వదేశంలోనూ ఉంటుంది, ఈ దేశంలోనే ఉంటుందని పఠాన్ లో కుండ బద్దలు కొట్టి చెప్పారు. అది అలా ఉంచుదాం. జవాన్ లో ఏం చెప్పాడు?

ఏం చెప్పాడో చెప్పడానికి ముందు, కొన్నాళ్ల క్రితం షారుక్ కొడుకుని ఒక డ్రగ్ మాఫియా కేసులో ఇరికించి, కటకటాల వెనక తోసేసి షారూఖ్ మీద కసి తీర్చుకుందాం అని రాజకీయ మాఫియా ఒకటి బాహాటంగానే వ్యూహాలు పన్నింది. కానీ పాపం ఆ ప్రయత్నాలు ఫలించలేదు. షారుఖ్ కొడుకు బయటపడ్డాడు. తండ్రి బలవంతుడు కాకపోతే ఇలాంటి కొడుకులు ఎందరో అమాయకులైన దుష్టశక్తుల వలలో చిక్కి బలి కావాల్సిందే. షారుఖ్ శక్తివంతుడు కాబట్టి కొడుకుని విడిపించుకున్నాడు. అయితే ఈ సినిమా ఆ విషయం చెప్పడానికి తీశాడా అంటే ఏమో చెప్పలేం. కానీ సినిమా, తండ్రీ కొడుకుల దేశభక్తి నేపథ్యంలో సోకాల్డ్ దేశభక్తుల స్వార్థ నీచ దుర్మార్గ రాజకీయాల మీద షారుఖ్ ఎక్కుపెట్టిన కోట్ల శతఘ్నుల ఫెళఫెళార్భటుల పెనుమోత అని చెప్పాలి.

సినిమా మొత్తం సందేశమంతా దేశం కోసం. సినిమా సాగిన తీరు మొత్తం పక్కా కమర్షియల్. సినిమాలో నాలుగు ప్రధానమైన అంశాలున్నాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతి దుర్మార్గమైన రాజకీయ కార్పొరేట్ల అక్రమ సంబంధాలపై తీసిన సినిమా ఇది . ఓపెనింగ్ అదిరిపోతుంది. రైతుల ఆత్మహత్య నేపథ్యంలో ఒక వ్యవసాయ శాఖ మంత్రిని గడగడలాడించిన సీన్ అదిరిపోతుంది. పాలకులు చూసి సిగ్గుపడాలి. రైతుల రుణాలు తీర్చలేకపోతే వారి జీవితాలని జప్తు చేస్తారు గాని, కార్పొరేట్లకు ఎన్నికల్లో వారి సహాయ సహకారాల కోసం మాత్రం వేలకోట్ల రుణాల మాఫీ చేసి ఘనంగా రుణం తీర్చుకుంటారు.

గోరఖ్ పూర్ లో ఘోరంగా 60 మంది పిల్లలు ఆక్సిజన్ లేక చనిపోయిన ఘటన గుర్తుంది కదా. అదొక ముఖ్యమైన సీన్ ఈ సినిమాలో. అక్కడా వెనకున్నది కార్పొరేట్ దుర్మార్గమే. ఇందులో వైద్య శాఖ మంత్రిని ఈడ్చుకొచ్చి జనం ముందు నిలబెట్టాడు. మరో సీన్లో అప్పనంగా దొరికే ప్రకృతి సంపద, జన వనరుల సంపద కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసే కార్పొరేట్లు, వాళ్లకు సాయపడే రాజకీయాలుంటాయి. ఇలా సినిమా చివరి వరకూ దేశం, రాజకీయాల, కార్పొరేట్ల కుటిల బంధాల కుయుక్తుల క్రూర వ్యూహాల్లో ఎలా మోసపోతుందో చెబుతుంది. చివరికి ఓటింగ్ మిషన్లను మొత్తం మాయం చేసి ప్రజలందరూ ఓటు వేసే ముందు ఐదు నిమిషాలు ఆలోచించండ్రా బాబు అని సందేశం ఇస్తుందీ సినిమా. దోమల్ని చంపడానికి ఐదు గంటలు పనిచేసే చిన్న పని ముట్టు కొనడానికే ఐదు గంటలు ఆలోచిస్తాం. ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని గుప్పిట పెట్టుకొని పండగ చేసుకునే దొంగల గురించి ఐదు నిమిషాలు కూడా ఆలోచించం, ఆలోచించండ్రా అని చివరికి షారుఖ్ దేశానికి సందేశం ఇస్తాడు.

సినిమా మొత్తం దాడులు, ప్రతి దాడులు, హీరోలు, విలన్లు, యుద్ధాలు, రక్తపాతాలు, విధ్వంసాలు, విలయాలు భయంకరంగా సాగుతూనే ఉంటాయి. కానీ అంతర్లీనంగా మనకు అందించే సందేశం మనల్ని చైతన్యవంతం చేస్తుంది. సినిమా చివర్లో విలన్ తో షారుఖ్ అంటాడు కదా, బేటా పే హాత్ లగానే సే పెహలే బాప్ సే బాత్ కర్ అని. నిజం చెప్పాలంటే షారుఖ్ తన కొడుకు గురించి ఈ సినిమా తీసి ఉంటాడు. కానీ షారుఖ్, దేశం మేలు కోరుకునే అనేక తండ్రులకు ప్రతిరూపం. తండ్రులంతా తమ బిడ్డలను కాపాడుకోవడానికి, ఈ దేశాన్ని చెరబట్టే కీచుకులను ఉద్దేశించి మాట్లాడే మాటగా దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకే క్యా రూఖ్ దిఖాయా షారుఖ్..! అంటాను.

Also Read: BiggBoss7: రాతిక రోజ్ కు యూత్ లో క్రేజ్.. బిగ్ బాస్ లో అందరి కళ్లు ఈ బ్యూటీపైనే!