Site icon HashtagU Telugu

Cyclone Sitrang In Assam : అస్సాంని వ‌ణికించిన “సిత్రంగ్ ” తుఫాను.. 83 గ్రామాల్లో..!

Biparjoy

Rain

సిత్రంగ్ తుఫాను అస్సాంని వ‌ణికించింది. సిత్రంగ్ కారణంగా సంభవించిన వరదలతో 83 గ్రామాలకు చెందిన దాదాపు 1100 మంది ప్రజలు స‌ర్వం కోల్పోయారు. అస్సాంలో పరిస్థితి భ‌యాందోళ‌న‌క‌రంగా మారింది. అస్సాంలో కురిసిన భారీ వర్షాలకు అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. తుఫాను కారణంగా 1146 మంది ప్రభావితమయ్యారు. అధికారుల లెక్కల ప్రకారం 325.501 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి తుపాను కారణంగా రాష్ట్రంలోని నాగావ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. తుఫాను కారణంగా సెంట్రల్ అస్సాం జిల్లాలోని కలియాబోర్, బముని, సక్ముతియా టీ ఎస్టేట్, బోరాలిగావ్ ప్రాంతాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదిలా ఉండగా ‘సిత్రంగ్’ తుపాను హెచ్చరికల మధ్య పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లోని బక్కలి బీచ్ తీరాన్ని అలలు తాకాయి. పర్యాటకులు, స్థానికులు సముద్రం దగ్గరకు వెళ్లవద్దని సివిల్ డిఫెన్స్ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై తీవ్ర అల్పపీడనాన్ని సృష్టించిన “సిత్రంగ్” తుఫాను అవశేషాలు ఈశాన్య బంగ్లాదేశ్, అగర్తలాకు ఈశాన్య మరియు షిల్లాంగ్‌కు నైరుతి దిశలో అల్పపీడనంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతకుముందు సోమవారం, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలకు సిత్రంగ్ తుఫాను ప్రభావంతో భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతాన్ని సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.

Exit mobile version