గత 24 గంటల్లో దేశంలో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల దట్టమైన పొగమంచు అలుముకుంది. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే.. ఉదయం 7 గంటల వరకు ఏ విమానం రూట్‌లో మార్పు రాలేదు. దేశ రాజధానిలో పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలు ఆలస్యమయ్యాయని ఢిల్లీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు మీడియాకు తెలిపారు. విమానాశ్రయంలో దృశ్యమానత చాలా తక్కువగా ఉంది. అందుకే ప్రయాణానికి వెళ్లే ముందు మీ విమానాల సమయాలను ఒకసారి చూసుకోవాలని మేము మీకు సలహా ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు శుక్రవారం పొగమంచు కారణంగా 16 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే తెలిపింది. ఉత్తర రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గయా-న్యూఢిల్లీ మహాబోధి ఎక్స్‌ప్రెస్, మాల్దా టౌన్-ఢిల్లీ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, బనారస్-న్యూఢిల్లీ కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్, కామాఖ్య-ఢిల్లీ బ్రహ్మపుత్ర మెయిల్, విశాఖపట్నం-న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు 1 గంట ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు.
Also Read: Wrestlers Protest: ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేలుస్తా: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్
వచ్చే 24 గంటల నుంచి జనవరి 22 వరకు గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 23 నుండి 27 వరకు పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉంది. వాయువ్య మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం నిస్సారమైన పొగమంచుతో సఫ్దర్‌జంగ్, పాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.